ఆక్సిజన్ పెట్టుకొని తిరిగే పరిస్థితి రావొద్దు: కేటీఆర్

by Anukaran |   ( Updated:2020-07-07 08:09:03.0  )
ఆక్సిజన్ పెట్టుకొని తిరిగే పరిస్థితి రావొద్దు: కేటీఆర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల ముంగిట సుపరిపాలన అందిస్తున్నారన్నారు. కష్ట కాలంలో కూడా 57లక్షల మందికి రైతుబంధు పథకం అమలు చేస్తున్న ఘనత తెలంగాణాకే దక్కుతుందన్నారు. అడవిని కాపాడుకోవల్పిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవాళి మనగడకు అత్యంత కీలకమైన పచ్చదనాన్ని పెంచుకునేందుకు నడుం బిగించాలని, లేనట్టయితే ఆక్సిజన్ కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి తయారవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొక్కలు నాటడం కాదు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలకు పరిష్కారం చూపామని, పోడు భూములను సాగు చేసుకుంటున్న 307మంది నిరుపేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని వెల్లడించారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టంచేశారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రీయ దృక్పథంతో నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. రోడ్లు బాగుంటేనే ఆర్థికవ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల గ్రామాలు కూడా ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తాయన్నారు. పల్లె ప్రాంత రహదారులు, వంతెనల విషయంలో గత ఆరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించామని, సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed