నా పర్యటనలోపు పనులు పూర్తి కావాలి: కేటీఆర్

by Shyam |   ( Updated:2020-06-12 09:22:21.0  )
నా పర్యటనలోపు పనులు పూర్తి కావాలి: కేటీఆర్
X

దిశ, మహాబుబ్ నగర్: కొడంగల్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను 3నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తన దత్తత నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధి మీద శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, వికారాబాద్, నారాయణపేట కలెక్టర్లు పౌసమీ బసు, హరిచందన తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల మీద శాఖల వారిగా చర్చించారు. ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి కోరిన మేరకు ముఖ్యంగా కోస్గి బస్ డిపో, బస్ స్టేషన్ నిర్మాణం పనుల మీద ఎండీ సునీల్ శర్మతో మాట్లాడుతూ..డిపోలు ఏర్పాటు చేసే యోచన లేకున్నా కోస్గి డిపో మాత్రం పూర్తి చేయాలన్నారు. అలాగే కోస్గి, కోడంగల్ మున్సిపాలిటీల్లో రూ.50 కోట్ల నిధులతో సాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. రూ.4 కోట్లతో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల, రూ.5 కోట్లతో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల నిర్మాణాల పూర్తి అంశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకోవాలన్నారు.

అదే విధంగా కొడంగల్, కోస్గి కేంద్రాల్లో 50 పడకల ఆస్పత్రుల నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి కోరడంతో వాటి మీద సంబంధిత అధికారులు, కలెక్టర్‌లతో చర్చించారు. దౌలతాబాద్లో రూ.8 కోట్ల నిధులతో సాగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులు వేగవంతం కావాలన్నారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తి అవుతున్నాయని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి వివరించగా, మరిన్ని ట్యాంక్‌లు, మిగిలిన కనెక్షన్‌లు, కొత్తగా అవసరమైన పైప్ లైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటు మీద ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిల సిఫార్సు మేరకు పూర్తి చేయాలని కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్, తాండూరు, చించోలి రోడ్డుతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరినట్లుగా నిధులకు ప్రతిపాదనలు పంపాలని, పంచాయతీ రాజ్ రోడ్లను వివిధ నిధులతో నిర్మించాలన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కోసం మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని, జూనియర్ కళాశాల ఏర్పాటు, మరిన్ని అంశాల కోసం సీఎం కేసీఆర్‌కు నివేదించాలని మంత్రులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు. నియోజకవర్గంలో రైతు బంధు, వ్యవసాయ పనుల మీద కేటీఆర్‌ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డి, ఎమ్మెల్యేను ఆరా తీశారు. కరోనా కట్టడి, ప్రజలకు అవగాహన మీద కూడా చర్చించారు. అయితే నిర్మాణం, అభివృద్ధి పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని తాను అదే నెలాఖరులో కొడంగల్‌లో పర్యటిస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed