సీఎం సాహసోపేత నిర్ణయాలు.. సంతోషంగా రైతులు

by Shyam |   ( Updated:2020-08-13 06:53:47.0  )
సీఎం సాహసోపేత నిర్ణయాలు.. సంతోషంగా రైతులు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా ప్రపంచంలోని అన్ని రంగాలు ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క తెలంగాణ రైతులు మాత్రమే సంతోషంగా ఉన్నారని, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణస్వీకార మహోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ… దేశంలోని ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సాహసోపేత నిర్ణయాలు సీఎం కేసీఆర్ తీసుకున్నాడని తెలిపారు. కోవిడ్ కారణంగా పండిన పంటను ఎలా అమ్ముకోవాలో దిక్కుతోచకుండా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రతి ఊరిలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పండిన ప్రతి గింజనూ కొన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో ఎక్కువ దిగుబడులు పండించి ఉమ్మడి నల్లగొండ జిల్లా రికార్డు సృష్టించిందన్నారు. 2014 కంటే ముందు ఎడారిలా ఉన్న జిల్లా, ఫ్లోరైడ్‌తో నాశనం ఆయిన నల్గొండ ఈ ఆరేండ్ల కాలంలో సర్వతోముఖాభివృద్ది చెందిందని తెలిపారు. ఒకప్పుడు కొట్లాటలు, కార్పణ్యాలు, పార్టీల గొడవలకు నల్లగొండ జిల్లా పెట్టింది పేరని గుర్తు చేశారు. కానీ నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిలుస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story