విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకుంటాం..

by Shyam |
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకుంటాం..
X

దిశ, న్యూస్‌బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ ముసాయిదా చట్టాన్ని ముమ్మాటికి అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కుట్రలో ఇదొక భాగమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టనున్న 2020 విద్యుత్ సవరణ చట్టం‌పై హైదరాబాద్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లును వ్యతిరేకించిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లు‌తో తెలంగాణ‌లో మొదట రైతులపైనే భారం పడుతుందని, అనంతరం గృహవినియోగదారులు ప్రభావితమవుతారని ఆయన తెలిపారు. ఈ చట్టం నిజంగా అమలుల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా 69 లక్షల గృహ వినియోగాదారులపై అదనపు భారం పడుతుందన్నారు. ఇలాంటి బిల్లును ఏ రకంగా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.

మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఈ బిల్లు‌తో తొలుత తమ అధీనం‌లోకి తెచ్చుకుని తద్వారా ప్రైవేటీకరణకు కేంద్రం వ్యూహం రూపొందించిందని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. రెన్యువబుల్ ఎనర్జీ‌తో మరింత ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. అంతర్గత భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, దేశ రక్షణ వంటి కీలక రంగాలను వదిలి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న విద్యుత్ రంగం‌పై పెత్తనం కోసం ఇటువంటి చట్ట సవరణలు తేవడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

Tags: new power bill, telangana, KCR, Jagadeesh reddy

Advertisement

Next Story

Most Viewed