వైద్యారోగ్య శాఖపై ఈటల ఫోకస్

by Anukaran |   ( Updated:2020-12-17 11:32:57.0  )
వైద్యారోగ్య శాఖపై ఈటల ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ దృష్టి పెట్టారు. చిన్న జబ్బులకు పెద్దాస్పత్రులకు పరుగులు తీసే అవసరం లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు జిల్లా దవాఖాన వరకు సకల ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచడంపై ఆలోచన చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండేలా ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లతో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రమే రోగులను పెద్దాస్పత్రికి పంపాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ అత్యవసర విభాగం కిందికి వచ్చేదని, ఏ బంద్‌లు, ధర్నాలతో సంబంధం లేకుండా 365 రోజులు పని చేస్తుందని, కరోనా సమయంలో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేసిన గుర్తింపు ఉందన్నారు. క్యాన్సర్, డయాలసిస్, తలసేమియా లాంటి జబ్బులకు అంతరాయం లేకుండా వైద్య సేవలు అందించిందని మంత్రి గుర్తు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు బోధనాస్పత్రి వరకు అన్నీ ఒక చైన్‌లా పని చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను సైతం మరింత మెరుగుపరచాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలు, వసతులు, సిబ్బంది కొరత తదితరాలపై మంత్రి చర్చించారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు.

Advertisement

Next Story