మెగా ప్లాంటేష‌న్ డే.. స్వయంగా విత్తనాలు జల్లిన మంత్రి

by Aamani |
మెగా ప్లాంటేష‌న్ డే.. స్వయంగా విత్తనాలు జల్లిన మంత్రి
X

దిశ, ఆదిలాబాద్: అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అట‌వీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డేలో పాల్గొన్న మంత్రి మావల హరితవనం నుంచి చాందా-టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకే రోజు లక్ష మొక్కలు నాటారు. అనంత‌రం ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, రాథోడ్ బాపురావు, క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌తో కలిసి మావ‌ల హ‌రిత‌వ‌నంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంతేకాకుండా హ‌రిత‌వ‌నంలో మొక్క‌లు నాట‌డంతో పాటు స్వయంగా మంత్రి విత్త‌నాలు చ‌ల్లారు. స‌ఫారి వాహ‌నంలో హ‌రిత‌వ‌నంలో కాసేపు ప‌ర్యాటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అడ‌వుల ర‌క్ష‌ణ‌కు, అడవులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. గ‌త ఐదు విడ‌త‌ల్లో హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా నాటిన మొక్క‌ల్లో 70శాతం బ‌తికాయ‌ని, పంచాయ‌తీరాజ్, మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం నాటిన మొక్క‌ల్లో 85శాతం స‌ర్వైవ‌ల్ అయ్యేలా చూసే బాధ్య‌త స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారుల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. కలప స్మగర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ క్షేత్రాల రక్షణ మనందరి బాధ్యత అని, కలప అక్రమ రవాణాకు సంబంధించి అధికారులకు సమాచారం అందివ్వాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed