వైద్యశాఖకు హరీశ్ రావు కీలక ఆదేశాలు.. ఇకపై ఉరుకులు పరుగులే..

by Anukaran |
Corona vaccine
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యాక్సినేషన్‌లో వేగం పెంచేందుకు స్వయంగా జిల్లా వైద్యాధికారులే గ్రామాలకు వెళ్లాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు అంతర్గత ఆదేశాలిచ్చారు. కొన్ని జిల్లాల్లో టీకా పంపిణీ చాలా నెమ్మదిగా కొనసాగుతుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, జగిత్యాల, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నాగర్​కర్నూల్, వనపర్తి, మహబూబ్​నగర్, నిజామాబాద్, వరంగల్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో పంపిణీ మందగించిందన్నారు. ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్​వాడీ సిబ్బంది అవగాహన కల్పించినా, టీకాలు వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు.

అంతేగాక కొంత మంది క్షేత్రస్థాయి సిబ్బందితో వాగ్వాదాలూ పెట్టుకుంటున్నారని మంత్రికి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వివరించారు. దీంతో స్వయంగా డాక్టర్లే రంగంలోకి దిగి చైతన్యం తేవాలన్నారు. ప్రజలకు వ్యాక్సిన్​ పట్ల అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. అంతేగాక నిత్యం ప్రజలతో కలిసిమెలసి ఉండే ఆర్ఎంపీలను కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. దీంతో ప్రజల్లో వేగంగా టీకా పంపిణీని పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుందని మంత్రి సూచించారు. టీకా పంపిణీ తక్కువగా ఉన్న ఆ పదిహేను జిల్లాల్లో వెంటనే స్పీడప్​చేయాలని కోరారు.

ఇంకా వెంటాడుతున్న భయం…

రాష్ట్ర వ్యాప్తంగా గత 11 నెలల నుంచి టీకా పంపిణీ జరుగుతున్నా, ఇప్పటికీ కొందరిలో భయం వీడలేదు. టీకా తీసుకున్న తర్వాత కొందరిలో తలెత్తుతున్న స్వల్ప పాటి సమస్యలు గురించే పదే పదే ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు. దీంతో మిగతా వారు టీకాను పొందేందుకు ముందుకు రావడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది వివరిస్తున్నారు. అంతేగాక కరోనా తీవ్రత తగ్గిందనే భ్రమలోనూ మరి కొందరు తీసుకోవడం లేదు. 18 ఏళ్ల పై బడిన వారిలో ఇప్పటికీ 15 శాతం మంది టీకా పొందలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

42 లక్షల మంది డోసుకు దూరం

రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పై బడిన వారిలో 2,77,67,000 మంది టీకాకు అర్హులుండగా, 2,35,22,231 మంది ఫస్ట్​ డోసును పొందారు. వీరిలో 1,08,51,873 మంది రెండో డోసునూ తీసుకున్నారు. మరో 42,44,569 మంది అసలు వ్యాక్సిన్​ వేసుకోలేదు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్​లో హైదరాబాద్​ ఫస్డ్​ఉండగా, వికారాబాద్ ​లాస్ట్​ప్లేస్‌లో ఉంది.

అతి తక్కువ
పంపిణీ జరిగిన జిల్లాలు ఇవే… (30శాతంలోపు)
జిల్లా టార్గెట్ పొందినవారు శాతం
కామారెడ్డి 7,26,377 2,06,146 28%
సంగారెడ్డి 11,94,364 3,36,292 28%
నిర్మల్ 5,36,170 1,50,605 28%
నల్లగొండ 12,07,6153 3,18,508 27%
వరంగల్ 5,14,700 1,25,356 24%
జగిత్యాల 7,58,727 2,06,146 27%
నిజామాబాద్ 11,36,289 2,70,479 24%
మహబూబ్​నగర్ 6,89,692 1,63,191 24%
వనపర్తి 4,27,849 89,702 21%
నాగర్​కర్నూల్​ 6,27,625 1,14,425 18%
ఆదిలాబాద్​ 5,48,094 97,442 18%
ఆసీఫాబాద్​ 3,90,094 55,343 14%
గద్వాల 4,60,075 63,791 14%
నారాయణ్​పేట్​ 4,15,650 55,521 13%
వికారాబాద్​ 7,09,526 94,600 13%

Advertisement

Next Story

Most Viewed