హరితహారాన్ని యజ్ఞంలా జరపాలి : హరీశ్ రావు

by Shyam |
హరితహారాన్ని యజ్ఞంలా జరపాలి : హరీశ్ రావు
X

దిశ, మెదక్: జిల్లాలో హరితహార కార్యక్రమాన్ని యజ్ఞంలా జరపాలని, జులై నెలాఖరులోపు.. ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు నిర్మాణాలు జరపాలని ప్రజాప్రతినిధులను, అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని తన నివాసం నుంచి మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, నిర్మాణాలు, పనుల పురోగతి, ప్రగతి అంశాలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో పశువుల షెడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీ నిర్వహణ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ఈయేడు హరిత హారంలో నాటాల్సిన మొక్కలు, వాటి సంరక్షణ, వానకాలంలో సాగు చేస్తున్న పంటలు, రైతుబంధు, రైతుబీమా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట మొదటి స్థానంలో నిలిచిందని, కానీ నంగునూరు మండలంలో డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలలో చివరి స్థానంలో ఉన్నామని ఇది అధికారులు, మండల ప్రజాప్రతినిధుల పనితీరుకు నిదర్శణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన హరిత హారం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉదయం 10 గంటలకు అన్ని గ్రామాల్లో ఒకేసారి యజ్ఞంలా మొక్కలు నాటేందుకు కావాల్సిన సన్నాహాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story