నీటిని సద్వినియోగం చేసుకోవాలి: హరీశ్ రావు

by Shyam |
నీటిని సద్వినియోగం చేసుకోవాలి: హరీశ్ రావు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రధాన కుడి, ఎడమ కాలువల పరిధిలోని రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రామాల వారీగా చెరువులు, కుంటలు, వాగులు నింపనున్న అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కాలువల తూములకు యుద్ధప్రాతిపదికన గేట్లు బిగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను గుర్తించి నీటి విడుదలలో హెచ్చుతగ్గులు చేయాలని చెప్పారు. చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందేలా తహశీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి ద్వారా నీటి వృథా తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా పెరిగిందని తెలిపారు. రైతులు అవసరమున్నంత వరకు నీళ్లు వాడుకుని తూములను మూసివేసేలా చొరవ చూపాలని సూచించారు. పొదుపు చేసిన నీరే తాగునీటి, సాగునీటికి కూడా ఉపయోగపడుతుందన్నారు. నీటి పొదుపుపై త్వరలోనే రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. మైనర్, సబ్ మైనర్ కాల్వలు పూర్తి చేసి, వాటి ద్వారా చెరువులు, కుంటలకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డీఈ గోపాలకృష్ణ, చిన్నకోడూర్, నంగునూరు మండలాల తహశీల్దార్లు, ఆయా మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Harish Rao, review meeting, Irrigation officials, siddipet

Advertisement

Next Story

Most Viewed