- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇల్లందకుంటలో మిత్రుడిపై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు
దిశ, హుజురాబాద్, జమ్మికుంట : రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ విషయం మాజీ మంత్రి ఈటలను, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పార్టీ పెద్దలను చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఈటలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికార పార్టీ నేతలు… ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం. మంత్రి హరీష్ రావు కూడా ఒకప్పుడు ఈటలకి మంచి మిత్రుడు అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడాయన అధికార పార్టీకి వ్యతిరేకం.. అందుకే ఉపఎన్నికవేళ ఒకప్పటి మిత్రుడిని ఓడించేందుకు రంగంలోకి దిగారు ట్రబుల్ షూటర్.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఇల్లందకుంటలో పర్యటించిన మంత్రి.. బీజేపీ, ఈటల లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయిందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈటల గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు తప్ప నియోజకవర్గానికి ఏమీ చేయలేడన్నారు. రైతుబంధు వద్దు, దళిత బంధు వద్దు, ఆసరా పెన్షన్లు ఎవరడుగుతున్నారని ఈటల అంటున్నాడని ఆయన అలా వ్యాఖ్యానించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. ఓ వైపున రైతు బంధు వద్దంటూనే రూ. 10 లక్షల రైతు బంధు సాయం ఎందుకు తీసుకున్నాడని ఆరోపించారు.
కేసీఆర్‌ను రా అనవచ్చా..? నన్ను రారా అంటున్నాడు కానీ, తాము మాత్రం రాజేందర్ గారూ అని మాత్రమే సంబోధిస్తామని, ఆది ఆయన సంస్కారానికే వదిలేస్తామన్నారు. ఓటమి భయంతోనే ఈటల అలా మాట్లాడుతున్నాడని, తాను ఓడి పోతున్నానని ఈటల ఒప్పుకున్నారని హరీష్ రావు అన్నారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల ఒక్క పని చేయలేదని, నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు కట్టాలని ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడ కట్టలేదని విమర్శించారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు తప్ప ప్రజలుగా మనమంతా ఓడిపోతామన్నారు. మంత్రిగానే ఏమీ పనిచేయలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు కోరారు. ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని, గెల్లు శ్రీనివాస్‌ను ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలో ఈటలకు లాభం జరగాలోనన్న విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యేను మంత్రిని చేసింది కేసీఆరేనని, తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని, ఆయనను గులాబీ జెండానే ఇంతవాన్ని చేసిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ది చేస్తానని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. సిద్దిపేటలో మహిళా సంఘ భవనాలు లేని ఊరు లేదని, ఇక్కడ కూడా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే కట్టించి తీరుతామన్నారు. గడియారాలు, మిక్సీలు పంచి పెట్టడం ఆత్మగౌరవమా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ చెప్పేదొకటి చేసేది మరొకటి అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
హుజురాబాద్‌లో 2 గుంటలకు 2 వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. బీజేపీ పార్టీ ఏం చేయలేకపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ లాక్కుంటోందని హరీష్ రావు మండిపడ్డారు.