ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గంగుల

by Sridhar Babu |
ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ: వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిందని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అవసరమైతే తప్పా బయటకు వెళ్ళకుండా ఇళ్ళల్లోనే ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి గంగుల జిల్లా అధికారులతో హైదరాబాద్ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందిపడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, వరద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం, ప్రాజెక్టులు, కాలువల్లో నీరు నిండుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి అక్కడి పరిస్థితిని అధికారుల నుంచి ఆరా తీశారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాలని, వరదలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు పర్యవేక్షించాలని, శిథిలావస్థ భవనాలు, కూలిపోయే దశలో ఉన్న నిర్మాణాల్లో ప్రజలు ఎవరూ లేకుండా ఖాళీ చేయించాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు కూడా వర్షపాతం ఉన్నందున వరద నివారణ, ప్రమాద నివారణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed