కరోనా పోయేలా లేదు.. లాక్‌డౌన్ మాత్రం ఉండదు: ఈటల

by Anukaran |
కరోనా పోయేలా లేదు.. లాక్‌డౌన్ మాత్రం ఉండదు: ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలతో ఉండడమే శ్రీరామ రక్ష అని వైద్యారోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కరోనా వైరస్ పూర్తిగా పోయిందనే కొందరు భ్రమపడుతున్నారని, అందుకే మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారని ఆక్షేపించారు. రోజుకో కొత్త రకం స్ట్రెయిన్‌లు వస్తున్నాయని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల నమోదు అదుపులోనే ఉందన్నారు. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ లాంటివి పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలనూ కేంద్రం అప్రమత్తం చేసిందని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులనూ అలర్ట్ చేశామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహారాష్ట్రలో కేసులు గణనీయంగా పెరుగుతున్నందున తెలంగాణ సరిహద్దులలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అక్కడి నుంచే వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నామని తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టామని, భీవండి, సోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కూడా నిశితంగా పరీక్షిస్తామన్నారు. ఇందుకోసం టెస్టింగ్ కిట్లను సిద్ధంగా ఉంచామని, పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు కలిగినవారిని గుర్తించే ప్రక్రియపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు.

ఓపెన్ మార్కెట్లో టీకాలు అవసరం

ప్రస్తుతం హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలను ఇస్తోందని మంత్రి ఈటట చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, 50 ఏళ్ల వయసుదాటినవారికి టీకాల గురించి ఇంకా మార్గదర్శకాలు రాలేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. కరోనాను అదుపు చేసిందుకు కేంద్ర ప్రభుత్వం టీకాలను సరఫరా చేస్తోందని, కేసుల సంఖ్యకు అనుగుణంగా డోసులను ఎక్కువ సంఖ్యలో పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

సాధారణ ప్రజలకు టీకాలు అందుబాటులోకి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశముందన్నారు. అందువల్ల ఓపెన్ మార్కెట్‌లో టీకా లభ్యమయ్యేలా త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో టీకాలు అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేయడం సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. టీకాల గురించి వైద్యారోగ్య శాఖకు భారీ స్థాయిలో విజ్ఞప్తులు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed