కేసీఆర్‌ది మాట తప్పని ప్రభుత్వం.. మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

by Anukaran |
Minister Errabelli Dayakar Rao
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి రూ.1100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో సివిల్ వర్క్స్‌కి రూ.509 కోట్లు, తాగునీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిజ్వీ ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజాగా.. ఈ జీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ.. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం శంకు స్థాపన చేయడమే గాక, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం వల్ల పనులు మరింత వేగం అవుతాయని ఆశిస్తూ, మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తైతే, హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తోందన్నారు. అంతేగాకుండా.. మెరుగైన వైద్యం కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కి వెళ్లాల్సిన పనిలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed