అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్‌లు

by Shyam |
అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు అన్నిజిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లా, ఏరియా, బోధనాసుపత్రుల్లో అన్ని బెడ్లకూ ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాల్సిందిగా జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్లను మంత్రి కోరారు. అన్నిజిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆసుపత్రుల స్థితిగతులు, కొత్త అవసరాలు, కరోనా కట్టడి తదితర అంశాలపై మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.

జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నందున మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు సహాయకరంగా, అందుబాటులో ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసినందున జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సైతం కరోనా వైరస్ నివారణ చర్యలపై దృష్టి సారించాలని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషెంట్లను హోమ్ ఐసొలేషన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిపై రెగ్యులర్‌గా పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి అవసరమైన పేషెంట్లకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. పేషెంట్లకు చికిత్సతో పాటు మానసిక ప్రశాంతత, భరోసా కల్గించడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

కొత్త టెస్టింగ్ సెంటర్లు

ఈ సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ టెస్టింగ్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికి వివరాలను మొబైల్ అప్లికేషన్ (యాప్)లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. హోమ్ ఐసొలేషన్‌లో ఉండే పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మెడికల్ కిట్‌ను అందజేయాలన్నారు. కొత్తగా కరోనా టెస్టింగ్ సెంటర్లు అవసరమైతే తగిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కరోనా చికిత్సకు అవసరమైన వైద్యులు, మెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్దతిలో నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలు కలెక్టర్లు పంపిస్తే వెంటనే తగిన విధంగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు.

కొవిడ్ చికిత్సను అందించడానికి ప్రైవేటు ఆసుపత్రులు సైతం దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కరోనా చికిత్సకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నట్లయితే వాటిని నిర్దిష్ట ప్రొఫార్మాలో సంబంధిత అధికారుల ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలని కొద్దిమంది కలెక్టర్ల సందేహాలకు బదులిచ్చారు. ఐసోలేషన్ కిట్లు, వాటిలో పొందుపరిచే మందుల వివరాల కోసం సర్క్యులర్‌ను రూపొందించాలని, కొవిడ్‌ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌పై నిబంధనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

కరోనా చికిత్స సందర్భంగా వెలువడే మెడికల్, బయో వ్యర్థాల నిర్వహణపై ఐసీఎంఆర్ రూపొందించిన నిబంధనల మేరకు వైద్యారోగ్య, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్ అధికారులు సమిష్టిగా కార్యాచరణ అమలుచేయాలని ప్రధాన కార్యదర్శి నొక్కిచెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఎదురవుతున్న ఆటంకాలు, వాటిని పరిష్కరించడంపై పంచాయతీరాజ్ అధికారులతో సీఎస్ చర్చించారు.

Advertisement

Next Story