కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లిన.. ఆ మంత్రి

by Shyam |
కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లిన.. ఆ మంత్రి
X

దిశ, పాలకుర్తి: చెక్ డ్యామ్‌ల‌ నిర్మాణంతో అడుగంటుతున్న భూగ‌ర్భ జలాలు పెరిగే అవ‌కాశం ఉందనీ, దీంతో రైతాంగానికి సాగునీరు, ప్ర‌జ‌ల‌కు మంచినీటి కొర‌త తీరుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. శుక్రవారం జ‌న‌గామ జిల్లాలో మంజూరైన మొత్తం 18 చెక్ డ్యామ్‌ల‌ నిర్మాణ పనులను వెంటనే చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, కోలుకొండ‌, చౌడూరు మ‌ధ్య నిర్మించ‌నున్న చెక్ డ్యామ్‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ప‌రిశీలించారు. చెక్ డ్యామ్ నిర్మించే స్థ‌ల ప‌రిశీల‌న‌లో భాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి కోలుకొండ బ్రిడ్జి నుంచి కిలోమీట‌ర్ మేర కాలిన‌డ‌క‌న వెళ్ళారు. కొంత దూరం ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్ళారు. పెద్ద వాగు పరిసరాలు వ‌ర్షాల‌తో బుర‌ద‌మ‌యంగా మారడ‌ంతో అందులోనే న‌డిచారు. అనంతరం ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… భూ గ‌ర్భ జ‌లాలు పెర‌గ‌డానికి చెక్ డ్యామ్‌లు ఉపయోగపడతాయన్నారు. వాగుల్లో నిర్మించే ఈ చెక్ డ్యామ్‌లతో పారే నీటిని కొంత మేరకు నిలిపి ఉంచడంతో కనీసం 250 కీలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. జనగామ జిల్లాలో మొత్తం 18 చెక్ డ్యామ్‌లు నిర్మించనున్నట్టు వివరించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలో 7, ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 5, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 6 చెక్ డ్యామ్‌లు నిర్మించనున్నట్టు వివరించారు. అందులో ఒకటి పెద్ద వాగుపై నిర్మిస్తున్న చౌడూరు చెక్ డ్యామ్ అన్నారు. ఈ డ్యామ్‌కు రూ.3 కోట్ల 9 లక్షలు మంజూరయ్యాయయని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story