జనావాసాల్లోకి వన్యప్రాణులు.. మంత్రి స్పందన!

by Aamani |
జనావాసాల్లోకి వన్యప్రాణులు.. మంత్రి స్పందన!
X

దిశ, ఆదిలాబాద్: తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా అటవీ శాఖ ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపడుతుందని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జనావాసాల్లోకి ఇటీవల చిరుత పులులు, ఇత‌ర జంతువులు సంచరిస్తున్న తరుణంలో దీనిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పందించారు. సాధార‌ణంగా ఎండ‌కాలంలో ఆవాసాల‌ను వ‌దిలి నీటిని, ఆహ‌రాన్ని వెతుక్కుంటూ వ‌న్య‌ప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయని, దీనికి తోడు లాక్‎డౌన్ కారణంగా మనుషుల సంచారం, వాహనాల శబ్దాలు కూడా లేకపోవడంతో పక్షులు, వన్యప్రాణులు మ‌రింత స్వేచ్ఛగా విహరిస్తున్నాయని తెలిపారు.

సమస్యను నివారించే చర్యల్లో భాగంగా అడవుల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేప‌డుతున్నార‌ని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. అభ‌యారణ్యంలో జంతువుల దాహార్తి తీర్చేడ‌మే ల‌క్ష్యంగా నీటి వ‌న‌రుల ఏర్పాటుకు అట‌వీ శాఖ‌లో ప్ర‌త్యేకంగా ఓ విభాగం ప‌ని చేస్తోందన్నారు. ప్ర‌తి వేస‌విలో వాగులు, వంక‌లను కాపాడేందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. సోలార్ పంప్ సెట్ల‌తో పాటు సాస‌ర్ పిట్‌లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింప‌డం లాంటివి చేస్తున్నార‌ని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా శాఖాహార జంతువుల‌ కోసం గ‌డ్డి క్షేత్రాల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. వ‌న్య‌ప్రాణుల క‌ద‌లిక‌లు ప‌సిగ‌ట్టేందుకు అట‌వీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed