వలస కార్మికులకు క్వారంటైన్ గుడిసెలు

by vinod kumar |   ( Updated:2020-05-13 06:31:47.0  )
వలస కార్మికులకు క్వారంటైన్ గుడిసెలు
X

మూడో దశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. వలస కార్మికులంతా తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. అయితే వీళ్లంతా వివిధ ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వస్తుండగా.. వాళ్లు ఇన్ని రోజులున్న చోట కరోనా ప్రభావం ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ వారి కోసం మణిపూర్‌లోని ఓ కుగ్రామ ప్రజలు 80 గుడిసెలు నిర్మించారు. ఇంపాల్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరే ‘టుంగ్జయ్’. కాగా వారు చేసిన పనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు తెలియజేయడం విశేషం.

‘టుంగ్జయ్ గ్రామ పంచాయితీకి నా సెల్యూట్.. పలు రాష్ట్రాల నుంచి రాబోతున్న తమ గ్రామస్తులకు క్వారంటైన్ సదుపాయం కోసం వీరంతా కలిసి ప్రత్యేకంగా 80 గుడిసెలు నిర్మించారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, సెపరేట్ టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరాకి కూడా ఏర్పాటు చేశారు..’ అని సీఎం ట్వీట్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసే వారికి రేషన్ సరుకులు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా లాక్‌డౌన్‌తో తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ప్రజలు ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్నారనీ.. వారిలో చాలామంది వెనక్కి తిరిగివచ్చేందుకు ఇష్టపడుతున్నారని సీఎం బీరేన్ సింగ్ పేర్కొన్నారు. చెన్నై నుంచి మే 11 న ప్రత్యేక రైలులో 1140 మంది మణిపూర్‌కు వస్తున్నారు. వీరి క్వారంటైన్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. అంతేకాదు వచ్చిన వారందర్నీ మెడికల్ టీమ్స్ ప్రత్యేకంగా హెల్త్ చెకప్‌లు చేస్తాయని, వారిని వివిధ జిల్లాలకు తరలించేందుకు 50 ప్రత్యేక బస్సులు సిద్ధం చేశామని తెలిపారు.

Advertisement

Next Story