ఇన్సెంటివ్‌లిచ్చినా ఉండలేం.. వెళ్లిపోతాం..

by Sridhar Babu |
ఇన్సెంటివ్‌లిచ్చినా ఉండలేం.. వెళ్లిపోతాం..
X

దిశ‌, ఖ‌మ్మం: సాధారణంగా కార్మికులు ఎవరైనా యాజమాన్యం ఇన్సెంటివ్‌ ఇస్తుందని చెబితే ఆనందపడి పని చేస్తుంటారు. కానీ, అక్కడ మాత్రం ఇన్సెంటివ్‌లిచ్చినా మేం ఉండలేం..సొంతూళ్లకు వెళ్లిపోతాం అని అంటున్నారు. వివరాల్లోకెళితే.. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో నిర్మాణ పనుల్లో దాదాపు 2 వేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిషా, మ‌హారాష్ట్ర‌కు చెందినవారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో బీటీపీఎస్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో ఆ కార్మికులు దాదాపు 45 రోజులుగా వేతనాలు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేక, ఉండేందుకు సరైన సౌకర్యాలు లేక..సొంతూళ్లకు వెళ్లే వీలు లేక ఆపసోపాలు పడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్మాణ పనులకు అనుమతివ్వడంతో పనిలోకి రావాలని అధికారులు కార్మికులను కోరుతున్నారు. కానీ, వారు సొంతూళ్లకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో బీటీపీఎస్ నిర్మాణ పనుల నిర్వ‌హ‌ణ సందిగ్ధంలో ప‌డింది.

బీటీపీఎస్ పనులు స్తంభించే అవకాశం.!

ప్ర‌స్తుతం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిమితుల‌తో కూడిన ప్ర‌యాణానికి అనుమ‌తులిస్తుండ‌టంతో వ‌ల‌స కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. 3 నెల‌లుగా ఇంటికి దూరంగా ఉంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కార్మికులు ఇంటికి వెళ్తే బీటీపీఎస్ ప‌నులు స్తంభించే అవ‌కాశం ఉండ‌టంతో వారిని బుజ్జ‌గించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మయ్యారు. అయితే, తాము క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఏ ఒక్క అధికారి త‌మ వ‌ద్ద‌కు రాలేద‌నీ, తిన్నామా లేదా అన్న విష‌యం అడ‌గ‌లేదనీ, ఇప్పుడు వారి అవ‌స‌రార్థం ప‌నిలోకి రావాల‌ని కోరుతుండ‌టం బాధ‌కలిగిస్తోంద‌ని కార్మికులు వాపోతున్నారు. కార్మికుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన అధికారులు ప‌నుల్లోకి ర‌ప్పించేందుకు ఏకంగా రూ.9 వేల వ‌ర‌కు ఇన్సెంటివ్స్‌ను ప్ర‌క‌టించారు. భోజనం, వైద్యం, ఇత‌ర ఖ‌ర్చులు భ‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. అయినా కార్మికులు మెత్తప‌డ‌టం లేదు. అతికొద్దిమంది కార్మికులు మాత్రం విధుల్లో కొన‌సాగేందుకు సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేశారు. మిగ‌తావారు స్వ‌రాష్ట్రాల‌కు వెళ్లేందుకు అనుమ‌తులు పొంద‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. బీటీపీఎస్ అధికారులు కొంత‌మంది పోలీసుశాఖ అధికారుల‌తో మాట్లాడి త‌మ‌ను స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌నీయ‌కుండా చేస్తున్నార‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో రెండ్రోజుల కిందట దాదాపు 300 మంది కార్మికులు మ‌ణుగూరు త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేపథ్యంలో అసలు పనులు సాగుతాయా.?అనే దానిపై మూడ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని కిందిస్థాయి అధికారులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed