వలస కూలీల రాకపై ఖాకీల కన్ను..

by Shyam |
వలస కూలీల రాకపై ఖాకీల కన్ను..
X

దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో వలస కూలీలకు సడలింపులు రాష్ట్రంతోపాటు కేంద్రం కూడా ఇచ్చింది. వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వలస కార్మికుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పోలీసులు సరిహద్దు ప్రాంతాల వద్ద గస్తీ మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్నాటక రాష్ర్టాల సరిహద్దులు తాకుతుంటాయి. ఈ రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం సరిహద్దుల‌పై దృష్టి కేంద్రీకరించింది.

జిల్లాకు చేరుకున్న 1,500 మంది..

తెలంగాణలోకి ప్రవేశించేందుకు మహబూబ్‌‌నగర్ సరిహద్దులో అటు రోడ్డు సౌకర్యంతో పాటు నది మీదుగా కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కర్నూల్ నుంచి కొల్లాపూర్ వైపు నదిలో పుట్టిలు, మరబోట్ల సహాయంతో చాలా మంది తెలంగాణలోకి రాకపోకలు సాగిస్తుంటారు. అదే సమయంలో కర్నూల్ నుంచి అలంపూర్, గద్వాల ప్రాంతాలకూ చాలా మంది ఇరు రాష్ర్టాల వారు వస్తున్నారు. కర్నాటకలోని రాయచూరు, యానాగుంది, యదగిర్ ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి వచ్చే వారు ఎక్కువగా ఇదే దారుల మీదుగా వస్తుంటారు. దాంతో ఈ దారిపై ఖాకీలు గస్తీ కాస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది వలస కార్మికులు జిల్లాకు చేరుకున్నారు. వీరందరికీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అధికారులు..

జిల్లా నుంచి చాలా మంది ముంబయికి వలస వెళ్తుంటారు. ప్రస్తుతం ముంబయి‌లో పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో అక్కడ్నుంచి ఎవరైనా వస్తున్నారా అనే విషయమై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గద్వాల, అలంపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా తమ అవసరాల నిమిత్తం ఏపీ కర్నూల్ జిల్లాకు వెళ్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్ చాలా దూరంగా ఉంటుంది. పైగా కర్నూల్‌కు మెరుగైన రవాణా సౌకర్యం ఉండటంతో పాటు తక్కువ దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల నుంచి వచ్చే వెళ్లే ప్రతి సరిహద్దుపై పోలీసులు గస్తీని మరింత పెంచారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కర్నాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణ, దామరిగిద్ద, నారాయణపేట, కొడంగల్ సరిహద్దు ప్రాంతాలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను ఉంచారు. కర్నాటక నుంచే వచ్చే వారితో పాటు అటు వెళ్లే వారినీ అడ్డుకుంటున్నారు. అచ్చంపేట-శ్రీశైలం రహదారిని పూర్తిగా నిషేధించారు. సరిహద్దు ప్రాంతమైన మన్ననూరు, దోమలపెంట వద్ద కూడా పోలీసులు పహారాను ఏర్పాటు చేశారు.

Tags: covid 19 effect, lock down, permission to, migrant workers, coming to, united palamooru

Advertisement

Next Story