ఏం లేక.. కారం, నూనె కలుపుకొని తింటున్నం..

by Shyam |   ( Updated:2020-04-30 07:53:15.0  )
ఏం లేక.. కారం, నూనె కలుపుకొని తింటున్నం..
X

దిశ, రంగారెడ్డి: ఊరిలో పొలం లేదాయే.. ఏదో పనిచేసుకుందామంటే పనులు లేవాయే అని పట్నం పోయి బతుకుదామని తెలంగాణ జిల్లాలోని నిరుపేద కుటుంబాలు రాజధాని ప్రాంతానికి వలస వచ్చారు. అలా వలస వచ్చిన ఈ కూలీలు నగరంలో దొరికిన కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరిలో అత్యధిక కుటుంబాలు రోజు కూలీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి కూలీలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం వీరు కరోనా కారణంగా కూలీ లేక, చేతిలో నగదు లేక దయనీయ పరిస్థితిలో ఉన్నారు.

రాష్ట్ర రాజధాని విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడాలు, మరమ్మతుల కోసం, చిన్న మధ్యతరగతి కంపెనీల్లో నిత్యం ఈ కూలీలు కూలీ కోసం వెళ్తుంటారు. నగర శివారు ప్రాంతాలైన హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, తుర్కయంజాల్, మీర్ పేట్, తుక్కుగూడ సమీపంలోని ప్రాంతంలో నిర్మించిన ఇండ్లలో మరమ్మతులు పనులను చిన్నచిన్న ఇండ్లు కట్టి విక్రయించే వ్యాపారులు అడ్డా కూలీలతో పనులు చేయిస్తారు. కానీ, భయంకరమైన వైరస్ కరోనా వ్యాప్తి చెందడంతో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నది. అందులో హైదరాబాద్ లో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుండడంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో చిన్న, చిన్న పనులు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. నెల రోజులుగా పనులు లేకపోవడంతో తినేందుకు సైతం ఏమీ లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. కొంతమంది తక్కువగా ఉండే అద్దె ఇండ్లలో, మరికొంతమంది ఖాళీ ప్లాట్ స్థలాల్లో డేరాలు, గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు వారానికి 6 రోజులు కష్టపడాల్సిందే. లేకపోతే పూట గడవదు. ఇలాంటి కుటుంబాలు రంగారెడ్డి జిల్లా అర్భన్ ప్రాంతాల్లో వేల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం పచ్చడి, కారం, నూనె కలుపుకొని తింటున్నారు. ఒక పూట తింటే మరో పూట పస్తులుంటున్నారు.

అడ్డాకు ఆలస్యమైయ్యే…

సాదారణ పరిస్థితిలో కూలీలు తెల్లవారు జామునే ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఉ.7 గంటలకే అడ్డాలకు చేరుకుంటారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్తే ఉ. 6 గంటలకే భర్త అడ్డా కాడా కూలి మాట్లాడేందుకు పోతే… అదే సమయంలో భార్య ఇంట్లో పనులు పూర్తిచేసుకుని కూలీకి వెళ్లేందుకు రెడీగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరు కలిసిపోతారు. ఒక వేళ అడ్డా వద్దకు ఉదయం ఆలస్యంగా వెళ్తే పని దొరకదు. ప్రస్తుతం లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందోనని కూలీలు ఎదురు చూపులు చూస్తున్నారు.

ధరలతో దూరం…

రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం వారానికి మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన రోజులు సహాయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కూలీలు ఎప్పటి పూటకు అప్పుడు పప్పులు, ఉప్పులు, బియ్యం కొనుకుంటారు. కానీ, ఇప్పుడు ఒకేసారి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్న ధరలు విపరీతంగా పెరగడంతో కొనుకోలేని దుస్థితి నెలకొన్నది. ఈ కూలీలు ఉమ్మడి మహబూబానగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి వలస వచ్చారు. ఆడవారికి రూ.500, మగవారికి రూ.700ల చొప్పున వీరికి కూలీ కట్టిస్తారు. కానీ, కరోనా కారణంగా కూలీ రేట్లు తగ్గే అవకాశం లేకపోలేదు అని, అంతేకాదు కూలీ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోన్నదని వారు వాపోతున్నారు.

కరోనా కష్టాలు తెచ్చింది: నర్సింహా, అడ్డా కూలీ

నెల రోజులుగా పనులు లేవు. ప్రతి రోజూ కూలీ పని చేస్తేనే పూట గడుస్తది.. లేకపోతే పస్తులే. నేను ఆటోనగర్ అడ్డా మీదా ఉంటాను. రోజూ ఇసుక లారీ ఖాళీ చేసేందుకు పోతాను. ఇప్పుడు ఇంటికి పోలేక, పోయినా అక్కడ పనిలేదు. ఇక్కడ పనిలేక అవస్థలు పడుతున్నాము. ప్రభుత్వం అందించే సహాయం అందడంలేదు.

Tags: Rangareddy, Hyderabad, Migrant Workers, Corona Effect, Foods

Advertisement

Next Story