భగ్గుమంటున్నపెట్రోల్ ధరలు.. సామాన్యుడికి కష్టాలు

by Shyam |
భగ్గుమంటున్నపెట్రోల్ ధరలు.. సామాన్యుడికి కష్టాలు
X

దిశ, శేరిలింగంపల్లి: పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. జెట్ వేగంతో రోజురోజుకు పైపైకి దూసుకుపోతున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే గరిష్టసాయికి చేరిన ఇంధన ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పై చమురు సంస్థలు మరో 25 పైసలు పెంచడంతో పెట్రోల్‌ ధర రూ.88కు చేరింది. వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూపాయికి పైగా పెరుగడంతో వాహనదారులపై ఆర్థిక భారం పడుతుంది. పెరుగుతున్న ఇంధన ధరలు మోయలేని భారంగా మారుతున్నాయని అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

ధరలకు రెక్కలు..

దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఈవారంలో వరుసగా రెండో రోజు ధరలు పెరగడంతో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ పై లీటర్‌ కు 25పైసల చొప్పున చమురు సంస్థలు పెంచాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ మంగళవారం 26 పైసలు పెరిగి రూ.88.63లకు చేరుకోగా, డీజిల్‌ 27పైసలు పెరిగి రూ.82.26గా ఉంది. ఈనెల జనవరి 13,14 తేదీల్లో రెండు విడతలుగా లీటరకు 50పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు, మూడు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ పెట్రో భారం మోపుతూ వస్తున్నాయి. గత వారం రోజుల్లోనే పెట్రోల్‌ ధరలు రూపాయి మేర పెరగడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో అన్ని వర్గాలపై మోయలేని భారం పడుతుంది. ఇంధన ధరలు పెరిగితే దాని అనుబంధ రంగాలపై కూడా భారం పడుతుందని, నిత్యావసర వస్తువులు, ఛార్జీలు పెరగడం జరుగుతుందని దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

పెరుగుదలకు అనేక కారణాలు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కూడా ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతుందని అంటున్నారు. క్రూడాయిల్ తీయడం, సరఫరా భారంగా మారిందని, అందువల్ల ముడి చమురు అదే స్థాయిలో ఉన్నప్పటికీ, రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. పెరుగుతున్న చమురు ధరలతో వినియోగదారులు కలత చెందుతున్నారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధిక స్థాయికి చేరాయి. గత 18 రోజుల్లో పెట్రోల్ ధర సుమారు 4 శాతం, డీజిల్ 5 శాతం పెరిగింది.

అదీగాక చమురుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతరత్రా జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం పెట్రోల్‌ పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ 63 శాతం ఉండగా, డీజిల్‌ పై 60 శాతం ఉన్నాయి. ఇవన్నీ ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఏడాదికి రూ.14 పెంపు2020 జనవరి నాటికి, నేటికి పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. 2020 జనవరి 1న లీటర్ పెట్రోల్ ధర రూ.75.14 కాగా, జనవరి 10నాటికి ఇది రూ. 75.96 చేరింది. అప్పటి నుండి క్రమంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.63లకు చేరుకోగా, డీజిల్‌ 27పైసలు పెరిగి రూ.82.26గా ఉంది. దీంతో గత ఏడాదికి నేటికి దాదాపు పెట్రోల్ పై రూ.14 వరకు పెరగగా, డీజిల్ పై రూ. 10 వరకు పెరిగింది. ఇలా ఏటేటా ఇంధన ధరలు చుక్కలను అంటుతూనే ఉన్నాయి.

వాహనదారుల ఆగ్రహం

రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడాయిల్, డాలర్ రేట్లను బట్టి ఇంధన ధరలను పెంచడం సరికాదని నిర్దిష్టమైన ధరలను నిర్ణయించాలని కోరుతున్నారు. ఇంధన సరఫరాకు మనదేశంలో అవకాశం లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి ధరల పెరుగుదల, తగ్గింపు ఉంటుందని, దీనిపై దేశీయంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

బండి నడపలేం..ఇంట్లో నుంచి ఆటో బయటకు తీయాలంటేనే భయమేస్తుంది. రోజురోజు ధరలు పెంచితే ఎలా. కరోనా వల్ల బతకడమే కష్టమయ్యింది. జనాలు పక్కపక్కన కూర్చోడానికే భయ పడుతున్నారు, అసలే గిరాకీలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే మా జీవితలు ఇంకా కష్టంగా మారుతాయి.- కరణ్, ఆటో డ్రైవర్..

మేం ధరలు పెంచితే ఊరుకోరు.. ఓపక్కనేమో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. మాలాంటి చిన్న వ్యాపారులు ధరలు పెంచితే మాత్రం జనాలు అసలు ఊరుకోరు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే మాలాంటి చిన్న వ్యాపారులు ధరలను పెంచాల్సి వస్తుంది. ఆభారం మామీద కూడా పడుతుంది.-రాకేష్ కుమార్, చిరు వ్యాపారి.

ప్రభుత్వానికి నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం, తగ్గించడం ఇంధన కంపెనీల ఇష్టారాజ్యంగా మారింది. వాటిపై ప్రభుత్వానికి నియంత్రణ అనేది లేదు. అందుకే రేట్లు పెంచుతూ పోతున్నారు. సంవత్సరానికి ఒకటో రెండు సార్లో పెంచితే ఫర్వాలేదు. కానీ రోజురోజు పెంచడం అనేది దారుణం. -హరివర్ధన్ రెడ్డి, ఉద్యోగి

బండికంటే బస్సు బెటర్.. బండిమీద వెల్దాం అంటే ఓవైపు ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ధరలతో మధ్య తరగతి ప్రజానికానికి ఇబ్బందిగా మారింది. అన్ని వైపుల నుంచి వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారు. పెట్రోల్ ధరలు ఇంతలా పెరిగితే ఎలా. జీతాలు పెంచరు కానీ ధరలు పెంచుతారు. -శ్రీనివాస్, ఉద్యోగి.

Advertisement

Next Story

Most Viewed