జీవితం తలకిందులైన వేళ.. సేవింగ్స్ ఆవిరి..!

by Anukaran |
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది కాలంగా కరోనా వైరస్ కోట్లాది మంది జీవితాలను కకావికలం చేసింది. ఎంతో మంది కుటుంబాలను ఆర్థికంగా చిదిమేసింది. ఇప్పటికీ కోలుకోలేక దినదిన గండంగా బతుకుతున్నారు. ఇంతకాలం పైసాపైసా కూడబెట్టిన సేవింగ్స్ ఒక్క కరోనా వైరస్‌తో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. కరోనా వైద్యం కోసం ఆస్తులు అమ్ముకున్నవారు కొందరైతే, కూడబెట్టిన డబ్బుల్ని వాడుకున్నవారు మరికొందరు. అందుకే గత ఏడాది కాలంగా బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల నుంచి వెనక్కి తీసుకోవడం పెరిగింది. ప్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులుగా ఉన్న కార్మికులు వారి దైనందిన అవసరాల కోసం విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఇక హెల్త్ ఇన్సూరెన్సు తీసుకున్నవారు రీఇంబర్స్‌మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు సామాన్యులకు కష్టాలను, ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టాయి.

కరోనా కోసం పీఎఫ్ డబ్బులు ఖాళీ..

రకరకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి నెలా జీతంలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం పీఎఫ్ ఖాతాల్లో దాచుకున్న సేవింగ్స్ డబ్బులు కరోనా కారణంగా కరిగిపోయాయి. కరోనా కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‘ లాంటి ప్యాకేజీలేవీ కార్మికులను, వేతనజీవులకు పెద్దగా ఉపశమనం కలిగించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాల్లోని దాచుకున్న డబ్బులో 75% వరకు తీసుకోడానికి అవకాశం కల్పించింది. కరోనా వైద్య చికిత్స ఖరీదైనదిగా మారిపోవడంతో దాదాపు మూడున్నర కోట్ల మంది ఈ ఏడాది కాలంలో పీఎఫ్ ఖాతాల్లోంచి విత్‌డ్రా చేసుకున్నారు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న సుమారు 76 లక్షల మంది రూ. 18,698 కోట్ల మేర అడ్వాన్సు క్లెయిమ్ ద్వారా తీసుకున్నట్లు ఈపీఎఫ్ పేర్కొన్నది.

ఈపీఎఫ్ సంస్థ లెక్కల ప్రకారం, గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకు దాదాపు రూ. 1.25 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. మూడు నెలల వేతనానికి సమానమైన డబ్బును లేదా మొత్తం సేవింగ్ అయినదాంట్లో 75% వరకు తీసుకోవచ్చన్న నిబంధనతో వైద్య అవసరాలకు దీన్ని వాడుకున్నారు. దీనికి తోడు చాలా మంది ఖాతాలను పూర్తిగా క్లోజ్ చేసుకుని సెటిల్ చేసుకోడానికి కూడా మొగ్గుచూపారు. అటువంటివి దాదాపు రూ. 81 వేల కోట్లు ఉన్నట్లు ఈపీఎఫ్ సంస్థ పేర్కొన్నది. సగటున ఒక్కో వ్యక్తి దాదాపు రూ. 25,000 తీసుకున్నట్లు లెక్కగట్టింది. ఎక్కువగా స్కిల్ లేని కార్మికులే దీన్ని డ్రా చేసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

బ్యాంకు ఖాతాల సేవింగ్ తీరూ అంతే..

చీటీల రూపంలో దాచుకున్నది మొదలు వివిధ రూపాల్లో కష్టకాలంలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో సేవింగ్ డిపాజిట్ చేసుకున్నవారి కలలను కరోనా మింగేసింది. కరోనా వైద్యం కోసమే ఖాతాల్లోంచి డబ్బును తీసేసుకున్నారు. రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారమే చూస్తే… కోట్లాది కుటుంబాలు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్ రూపంలో దాచుకున్నది మొదలు వివిధ రూపాల్లో కూడబెట్టుకున్నది మొత్తం జీడీపీలో గతేడాది జూన్ నాటికి 21% ఉంటే కరోనా మొదటి వేవ్‌లో అది సగం తగ్గిపోయి 10.4 శాతానికి పడిపోయింది. ఇక డిసెంబరు నాటికి 8.2 శాతానికి తగ్గిపోయింది.

ఆర్బీఐ లెక్కల ప్రకారం కుటుంబాల సేవింగ్స్ జీడీపీలో గతేడాది జూన్ నాటికి 21%. అది సెప్టెంబరు నాటికి 10.4%కి, డిసెంబరు నాటికి 8.2%కి పడిపోయింది. అంటే డబ్బుల రూపంలో చూస్తే గతేడాది జూన్ చివరి నాటికి రూ. 8.15 లక్షల కోట్ల మేర సంపద ఉంటే సెప్టెంబరు నాటికి అది 4.91 లక్షల కోట్లకు, డిసెంబరు చివరి నాటికి రూ. 4.44 లక్షల కోట్లకు తగ్గిపోయింది. బ్యాంకుల్లో ఓవరాల్ డిపాజిట్ల మొత్తం పెరిగినా సేవింగ్స్ చేసుకునే కుటుంబాల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. గతేడాది సెప్టెంబరు నాటికి కుటుంబాలు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో దాచుకున్నది రూ. రూ. 3.67 కోట్లు ఉంటే డిసెంబరు నాటికి 1.73 కోట్లకు తగ్గిపోయింది. వైద్య అవసరాల కోసం డ్రా చేసుకోవడమే ఇందుకు కారణం.

పెరిగిన హెల్త్ ఇన్సూరెన్సుల క్లెయిమ్‌లు..

ఇంకోవైపు మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులు, అధికాదాయ వర్గాలు వ్యక్తిగత, గ్రూపు ఇన్సూరెన్సుల క్లెయిమ్‌లకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. కరోనా కారణంగా కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుల మీద చికిత్స తీసుకోవడంతో అనివార్యంగా రీఇంబర్స్ చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో క్లెయిమ్‌ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొత్తం పన్నెండు నెలల్లో వచ్చిన సంఖ్య కంటే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మాసాల మధ్య మూడు నెలల కాలంలో వచ్చినవే ఎక్కువ అని తేలింది.

జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లెక్కల ప్రకారమే చూస్తే… ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశం మొత్తం మీద 12.20 లక్షల కొవిడ్ సంబంధిత క్లెయిమ్ దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తే సుమారు రూ. 13,804 కోట్లు రీఇంబర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని, అన్ని స్థాయిల్లో స్క్రూటినీ అయిపోయిన తర్వాత అర్హమైనవిగా తేలిన 9.44 లక్షల దరఖాస్తుల్లో రూ. 9,178 కోట్ల మేర సెటిల్ చేసినట్లు పేర్కొన్నది. గతేడాది లెక్కలతో పోలిస్తే, మొత్తం పన్నెండు నెలల కాలంలో 9.86 లక్షల దరఖాస్తుల్లో అర్హమైనవిగా తేలిన 8.49 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించి రూ. 7,833 కోట్ల అమౌంట్ చెల్లించినట్లు పేర్కొన్నది. కానీ గతేడాది పన్నెండు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మూడు నెలల క్లెయిమ్‌లే ఎక్కువ అని నొక్కిచెప్పింది. ఇదంతా కరోనా సెకండ్ వేవ్ ప్రభావమేనని వ్యాఖ్యానించింది.

మొత్తం హెల్త్ క్లెయిమ్‌లలో దాదాపు 45% కేవలం కరోనాకు సంబంధించినవేనని ఆరోగ్య బీమా సంస్థలు పేర్కొన్నాయి. గతేడాది తొలి మూడు నెలల కాలంలో కరోనా సంబంధిత క్లెయిమ్‌లు కేవలం 17 శాతం మాత్రమేని పేర్కొన్నాయి. దీన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య చికిత్స ఖరీదైనదిగా మారిపోవడంతో అన్ని బీమా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియం ధరను దాదాపు 31% మేర పెంచాయి. గతేడాది వరకూ గ్రూపు హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియంలు ఎక్కువగా ఉంటే కరోనా కారణంగా మధ్యతరగతి, అధిక ఆదాయ వర్గాలు తీసుకునే రిటైల్ హెల్త్ ఇన్సూరెన్సుల సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే రూ. 17 వేల కోట్లకుపైగా ప్రీమియం రూపంలో సమకూరినట్లు కౌన్సిల్ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ విషయాన్నే చూసుకుంటే, 2020-21 మొదటి క్వార్టర్‌లో 1,02,157 ప్రీమియంలు రిజిస్టర్ అయితే, అందులో 79,185 హెల్త్ ప్రీమియంలు, 22,972 రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26,570 ప్రీమియంలకు కరోనా ట్రీట్‌మెంట్ రీఇంబర్స్ కోసం దరఖాస్తులు అందాయి. వీటికి సుమారు రూ. 106 కోట్ల మేర సెటిల్ చేసినట్లు కౌన్సిల్ వివరించింది. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉందని, రెండో క్వార్టర్ సెప్టెంబరుతో ముగిసిన తర్వాత క్లారిటీ వస్తుందని పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed