మిలిందా గేట్స్ రెండోసారి విరాళం!

by Harish |
మిలిందా గేట్స్ రెండోసారి విరాళం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవాల్సిన ఈ సమయంలో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే సహాయాన్ని ఆపేయడం సరైన నిర్ణయం కాదని బిల్‌గేట్స్ భార్య, గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి శ్రమిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు మరోసారి భారీగా విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. తాము అందించే విరాళం నుంచి వ్యాక్సిన్ తయారీ, కరోనా బాధితులకు చికిత్స, నివారణ వంటి చర్యలను చేపట్టాలని ఆమె కోరారు. ఇంతకుముందు గేట్స్ ఫౌండేషన్ డబ్ల్యూహెచ్‌వోకు 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రజారోగ్యం కోసం ఆ విరాళాన్ని ప్రకటించారు. మళ్లీ రెండోసారి విరాళం ఇవ్వడం ద్వారా గేట్స్ ఫౌండేషన్ విరాళం మొత్తం 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కరోనా లాంటి మహమ్మారిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్‌వో లాంటి సంస్థ సరైనదని ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ నేతలందరూ కలిసి తగిన నిర్ణయం తీసుకోవాలని మిలిందా గేట్స్ అభిప్రాయపడ్డారు. అమెరికా డబ్ల్యూహెచ్‌వోకు సాయం చేయమంటూ వెనక్కి వెళ్లడం వల్ల కలిగే నష్టం అపారమైనదని ఆమె భావించారు.

Tags: Melinda Gates, WHO funding, Coronavirus, fight with coronavirus

Advertisement

Next Story

Most Viewed