ఏప్రిల్ 8 తో మెగాస్టార్ అనుబంధం

by Shyam |
ఏప్రిల్ 8 తో మెగాస్టార్ అనుబంధం
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు చిరు. ప్రతీ విషయాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ… లాక్ డౌన్ సమయంలో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8వ తేదీతో నాకు చాలా అనుబంధం ఉందంటూ రెండు రోజులుగా అభిమానుల్లో ఉత్కంఠ రేపిన చిరు… ఆ అనుబంధం ఏంటనేది పంచుకున్నాడు.

ఏప్రిల్ 8 .. హనుమాన్ జయంతి…

ఆంజనేయస్వామితో చిన్నప్పటి నుంచి నాకు చాలా అనుబంధం ఉందని తెలిపారు చిరు. 1962లో తనకు లాటరీలో హనుమాన్ బొమ్మ వచ్చిందని… అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉందన్న చిరు….ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్ అన్నారు. ఆ బొమ్మను కూడా అభిమానులతో షేర్ చేసుకున్న చిరు… అసలు ఆ బొమ్మ దాచుకునేందుకు కారణం తన తండ్రి చెప్పిన మాటలని గుర్తు చేసుకున్నారు.

ఆ రోజు చిరు చేతిలో ఆంజనేయుని బొమ్మ చూసిన తండ్రి.. “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకులానే ఉన్నాయి” అన్నారట. దాంతో అప్పటి నుంచి ఆ బొమ్మను అలాగే దగ్గర పెట్టుకున్నారట చిరు. అప్పుడు చిరు ఎలా ఉండేవారో.. ఆ చిన్నప్పటి ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ రెండు ఫోటోలను చూస్తే… తండ్రి చెప్పినట్లుగానే చిరు హనుమాన్ బొమ్మ పోలికలతో ఉన్నారు అంటున్నారు అభిమానులు.

కొన్ని దశాబ్దాల తరవాత 2002 లో బాపు గారు కూడా అదే చెప్పారట. బాపు గారు చిరు ఇంట్లో పెట్టుకునేందుకు తనకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారట చిరుతో. ఆ చిత్రాన్నే పాలరాతి మీద చెక్కించి పూజ గదిలో పెట్టుకున్నానని తెలిపిన చిరంజీవి … ఈ బొమ్మను చిరుకు ఇచ్చేటప్పుడు బాపు గారు అన్నారట… “ఏంటోనండి … హనుమాన్ బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు ” అని. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రం అనిపించిందట చిరుకు. ఇదే ఏప్రిల్ 8 తారీఖుతో తనకున్న అనుబంధం అని తెలిపిన చిరు… అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Chiranjeevi, Megastar, April 8, Tollywood, Hanuan Jayanthi

Advertisement

Next Story

Most Viewed