ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో డానిల్ మెద్వెదేవ్

by Shiva |
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో డానిల్ మెద్వెదేవ్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లోకి రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్ అడుగుపెట్టాడు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని రాడ్ లెవర్ అరేనాలో గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 6-4, 6-2, 7-5 వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ మొదటి నుంచి మెద్వెదేవ్ తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. సిట్సిపాస్ వరుసగా అనవసర తప్పిదాలు చేసి మెద్వెదేవ్‌కు పాయింట్లు అందించాడు. మరోవైపు మెద్వెదేవ్ తన బలమైన బ్యాక్‌హాండ్ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు. తొలి రెండు సెట్లలో తేలికగా వదిలేసినా.. చివరి సెట్‌లో మాత్రం సిట్సిపాస్ పోరాడాడు. అయినా ఫలితం లేకపోయింది. డానిల్ మెద్వెదేవ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం గమనార్హం. 2019లో యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌కు తొలి సారిగా చేరుకున్నాడు. కానీ స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్‌పై ఓడిపోయాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్‌తో తలపడనున్నాడు. మ్యాచ్ అనంతరం ఓడిపోయిన సిట్సిపాస్ మాట్లాడుతూ.. ఫైనల్లో జకోవిచ్‌పై మెద్వెదేవ్ గెలవడం టెన్నిస్‌కు మంచి చేస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Next Story