పేరుకే పెద్దాసుపత్రి..గ్లౌజులకే దిక్కులేదు..!

by Shyam |
పేరుకే పెద్దాసుపత్రి..గ్లౌజులకే దిక్కులేదు..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆమె పేరు సునీత (పేరు మార్చాం). నకిరేకల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి. అమ్మగారింటితో పాటు అత్తగారిల్లు నకిరేకల్ మండల పరిధిలోని గ్రామాలు కావడంతో ప్రెగ్నెన్సీ అయిన దగ్గరి నుంచి నకిరేకల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చెకప్ చేయిస్తూ వచ్చారు. ఇటీవల డెలివరీ తేదీ దగ్గరకు రావడంతో నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు సునీతను తీసుకొచ్చారు. అయితే డెలీవరి కోసమని ప్రభుత్వాస్పత్పికి వచ్చిన సునీతను నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు.

తీరా ఆస్పత్రికి తీసుకెళ్లే.. అక్కడి సిబ్బంది మెడిసిన్ లేదంటూ చెప్పారు. సర్జరీ చేయాలంటే.. బయటి నుంచి మెడిసిన్ తెచ్చుకోవాలంటూ సర్జికల్ సామగ్రితో పాటు సెలైన్ బాటిల్స్, దూది తదితరాలను చిటీని రాసిచ్చారు. చివరకు కుటుంబ సభ్యులు అవి తెచ్చుకుంటేనే.. సర్జరీ చేశారు. నకిరేకల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేస్తారని వస్తే.. ఇంత దూరంలో ఉన్న నల్లగొండకు సొంత చార్జీలు పెట్టి తీసుకొచ్చామని, పైగా సర్జికల్ సామగ్రి, మెడిసిన్ భారం తమపైనే పడిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రి పరిస్థితి. ఉమ్మడి జిల్లా కాలం నుంచే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి పాలనా కాలంలో 250 పడకల సామర్థ్యంతో కొనసాగుతుండగా, మెడికల్ కాలేజీకు అనుబంధంగా చేస్తూ 550 పడకల ప్రభుత్వ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ అందుకు తగిన విధంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించడం మాత్రం మరిచారు.

ఫలితంగా ఉన్న కొద్ది మంది వైద్యులు, సిబ్బందిపై తీవ్ర భారం పడుతోంది. దీంతో రోగులకు వైద్యసేవలు అందించడంలో న్యాయం చేయలేకపోతున్నారు. మరోవైపు నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. వాస్తవానికి జనరల్ ఆస్పత్రికి మెడిసిన్ కొనుగోళ్ల కోసం ప్రతి మూడు నెలలకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలుస్తోంది. నిజానికి ప్రతి మూడు నెలలకు బడ్జెట్ రూ.6లక్షలు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఆ మేరకు నిధులు అందడం లేదు. నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి ఓ వైపు మందుల కొరత.. మరో వైపు వైద్యులు, సిబ్బంది లేమితో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడి పడుతోందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

విభాగం ఉండాల్సినవి ఉన్నవి
ఫిజీషియన్లు- 10 4
స్టాఫ్ నర్సులు- 175 125

అరకొర నిధులతో అవస్థలు

నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రి వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈకి మారినా ఆస్పత్రికి వచ్చే నిధులు ఏ మాత్రం పెరగలేదు. గతంలో మాదిరిగానే 450 పడకలకు మాత్రమే ప్రభుత్వం అన్నిరకాల బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. ఏడాది కాలంలో నాలుగు విడతలుగా రూ.9.36లక్షల విలువైన సర్జికల్ సామగ్రి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రి ఐపీ(శస్త్ర చికిత్సలు పొందుతున్న రోగులు) 430 మంది ఉన్నారు. వీరితోపాటు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 190 మంది, కరోనా వార్డులో 52 మంది చికిత్స పొందుతున్నారు. నిత్యం 710 నుంచి 760 మంది వరకు ఓపీ ఉంటుంది. దీంతో పాటు ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు 2500 మందికి పైగా కొవిడ్ బాధితులు చికిత్స పొందారు. రోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగినా ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ మాత్రం మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల స్థాయిలో రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

బయట నుంచి కొనాల్సిందే..

జిల్లాకే పెద్దాస్పత్రిగా ఉన్న జనరల్ ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం నరకయాతన పడుతున్నారు. మాతా శిశు సంరక్షణ విభాగానికి వచ్చే గర్భిణులకు ప్రసవయాతన తప్పడం లేదు. కేసీఆర్ కిట్టు, నగదు ప్రోత్సాహాకాలు, 102 సర్వీసు వంటి పథకాలకు ఆకర్షితులై వచ్చేవారు, ఏరియా ఆస్పత్రుల్లో జరగాల్సిన ప్రసవాలు సైతం ఇక్కడికి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు కూడా ఉంటున్నారు. దీంతో ఐసీయూ, డయాలసిస్, ఐసొలేషన్ వార్డుల్లో వైద్యులు రాసే మాత్రలు, పరికరాలను వారం పది రోజులుగా రోగులు బయట నుంచే కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ప్రసవమైనా.. శస్త్రచికిత్స అయినా.. మరో చికిత్స అయినా బాధితులు సర్జికల్ సామగ్రి బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed