కరోనా కష్టం.. లేకున్నా తప్పని నష్టం

by Aamani |
కరోనా కష్టం.. లేకున్నా తప్పని నష్టం
X

దిశ, ఆదిలాబాద్ :
ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో కరోనాయేమోనని కంగారుపడ్డారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ జరిగిన హడావిడి, దవాఖాన సిబ్బంది అత్యుత్సాహం.. వెరసి సంబంధిత అధికారి రోగి వివరాలన్నీ మీడియాకు వెల్లడించాడు. ఆ తర్వాత రోగిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల తర్వాత సంబంధిత వ్యక్తికి కొవిడ్ -19 నెగెటివ్ అని రిపోర్టులు కూడా వచ్చేశాయ్ ! అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తితో మాట్లాడాలంటే జనం వణికిపోతున్నారు. ఆ కుటుంబంతోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇది ఇది నిర్మల్ జిల్లా సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

గత వారం కరోనా లక్షణాలతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన సందర్భంగా ఆ వ్యక్తి వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. కాగా ఆ టైమ్‌లో ఆసుపత్రి సిబ్బంది ప్రదర్శించిన అత్యుత్సాహం, వెలిబుచ్చిన అనుమానాల కారణంగా పారిపోయిన వ్యక్తిని ఎలక్ట్రానిక్ మీడియా వెంటాడింది. సవాలక్ష ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాల్సిన వారు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు కూడా వీడియోతో సహా సోషల్ మీడియాలో ప్రచారం కల్పించారు. దీంతో సాధారణ జబ్బులో కనిపించే లక్షణాలు కాస్త, అతన్ని బలమైన కరోనా వ్యాధిగ్రస్తునిగా చూపాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సమీప బంధువులు మొదలుకొని మిత్రుల వరకు.. ఆ వ్యక్తిని పలకరించేందుకు, ఆయన ఇంటికెళ్లేందుకే కాదు.. ఆ వైపునకు వెళ్లడానికి జంకుతున్నారు. రోగికి కరోనా నెగిటివ్ ఉందని గాంధీ దవాఖాన వైద్యులు తేల్చినా.. ఇంకా చుట్టుపక్కల వారి అనుమానపు చూపులు ఆయనను వీడటం లేదు. ‘నన్నెవరూ ముట్టలేదు.. పట్టలేదు..’ కానీ ఏదో రోగం ఉందంటూ నన్ను వేధిస్తున్నారని చెబుతున్నా.. కరోనా అనుమానపు నీడలు ఆ వ్యక్తిని క్షోభకు గురిచేస్తున్నాయి.

దీనికి కారణం ఎవరన్నది సమాజమే తేల్చాలి..! ఈ వ్యవహారం మాత్రం బాధితునితో పాటు అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోంది.

Tags: corona, Adilabad, corona Patients, negative report, media false campaign

Advertisement

Next Story

Most Viewed