విదేశాలకు శ్వేతా మహంతి..? కొత్త బాస్‌గా ఎవరికి చాన్స్..

by Shyam |   ( Updated:2021-08-05 09:19:18.0  )
Swetha-mahanthi
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఉన్నత చదువుల కోసం కలెక్టర్ శ్వేతా మహంతి విదేశాలకు వెళ్లడం ఖాయమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 9 లేదా 10న విధుల నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాకు కొత్త కలెక్టర్ ఎవరనే అంశం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. కలెక్టరేట్‌లో ఏ ఇద్దరు అధికారులు, సిబ్బంది కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతినే 9 నెలలుగా మేడ్చల్ జిల్లాకు ఇన్ చార్జీ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కీలమైన జిల్లా కావడంతో ఈసారి పూర్తి స్థాయి కలెక్టర్‌ను నియమిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లుగా కొనసాగుతున్న నారాయణ రెడ్డి, హన్మంత్ రావు, వెంకట్ రామిరెడ్డిలలో ఎవరో ఒకరు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

9 నెలలుగా ఇన్‌చార్జీ కలెక్టరే..

జిల్లా పాలనాధికారి పోస్టు 9 నెలలుగా ఖాళీగానే ఉంది. గతేడాది నవంబర్ 14న ఇక్కడి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కలెక్టర్‌ను నియమించకపోగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలను అప్పగించింది. కలెక్టర్ పోస్టుతో పాటు జిల్లాలోని కీలకమైన మెజారిటీ శాఖలకు సైతం ఇన్చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జీ కలెక్టర్‌గా కొనసాగుతున్న శ్వేతా మహంతి వారంలో రెండు లేదా మూడు రోజులే కలెక్టరేట్‌కు వస్తున్నారు. కొద్ది గంటలే కార్యాలయంలో ఉండి పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ జిల్లాను సైతం హ్యాండిల్ చేయడంతో ఆమెపై పని భారం పెరిగింది. ధరణి ఫైళ్లను క్లీయర్ చేసేందుకు శ్వేతా మహంతి ఆఫీస్‌లోనే రాత్రి, పొద్దుపోయే వరకు పనిచేసిన దాఖాలాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్పుడైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారో.. అప్పటి నుంచి మేడ్చల్‌కు రావడం తగ్గించేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యమైన ఫైళ్లు ఉంటే అధికారులే వాటిని తీసుకొని హైదరాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి సంతకాలు చేయించుకుని వస్తున్నారు. దీనికి తోడు జిల్లా స్థాయి సమీక్షలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. కాగా, రాష్ట్రంలో 32 జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు ఉండగా, ఒక్క మేడ్చల్‌కు మాత్రమే ఇన్‌చార్జీ కలెక్టర్ కొనసాగుతున్నారు.

కీలక పోస్టులు ఖాళీ..

జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆకస్మికంగా తనిఖీలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ లేకపోవడంతో పాలనపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా పౌర సంబంధాల అధికారి కిరణ్ కుమార్‌కు సైతం హెడ్ ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వగా జిల్లాలో ఇన్చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి కె.మల్లికార్జున్ రావుకు నిర్మల్‌లో పోస్టింగ్ ఇవ్వగా.. మేడ్చల్ జిల్లాలో ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్‌లో ఉన్న డాక్టర్ వీరాంజనేయులను డిప్యూటేషన్ మీద పంపారు. పే అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్వీఆర్ చంద్రశేఖర్ కు నాగర్ కర్నూల్‌లో పోస్టింగ్ ఇవ్వగా, ఇక్కడ ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లాలో మూడు రోజులు పనిచేస్తే.. నాగర్ కర్నూల్‌లో మూడు రోజులు అందుబాటులో ఉంటున్నాడని ఆ విభాగం ఉద్యోగులు వాపోతున్నారు. ఇన్చార్జీలు పాలన వల్ల ఏ పనులు ముందుకు సాగడం లేదని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పలువురు వాపోతున్నారు.

భూ సమస్యలు పెండింగ్..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆనుకొని మేడ్చల్ జిల్లా విస్తరించడంతో ఇక్కడ భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. జిల్లాలో ఏదో ఒక్కచోట భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూ కబ్జాదారులు ఏదో ఒక వివాదానికి ఆజ్యం పోస్తుంటారు. పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు భూముల వివాదాలను పరిష్కరించేందుకు గతంలో ఉన్న తహసీల్దార్, ఆర్‌డీఓ, జేసీ కోర్టులను రద్దు చేసింది. వారి వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటీని జిల్లా స్థాయిలోనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రైబ్యూనల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెగ్యులర్ కలెక్టర్ లేనందున కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుతం ఇన్చార్జీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్వేతా మహంతి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. దీంతో ఆమె పాలన పరమైన వ్యవహారాల్లో హైదరాబాద్‌లోనే బీజీబీజీగా గడుపుతున్నారు. దీనికి తోడు విదేశీ చదువులపై ఫోకస్ పెట్టారు. మేడ్చల్ జిల్లాకు వారానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారు. జిల్లాకు వచ్చిన రోజునే పెండింగ్ ఫైళ్లన్నీ క్లీయర్ చేసేందుకు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో జిల్లాలో మెజారిటీ శాఖలకు చెందిన ఫైళ్లు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్వేతా మహంతి రిలీవ్ అయినప్పుడైనా మేడ్చల్ జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను ప్రభుత్వం నియమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed