‘‘జీఓ నెం.3‌ను పునరుద్ధరించాలి’’

by Shyam |

దిశ, హైదరాబాద్: ఆదివాసీ గిరిజనులకు 100 శాతం ఉద్యోగ నియామకాలు కల్పించే జీఓ నెం.3‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివాసీ గిరిజన సంఘంతో కలిసి ఆయన ఆదివారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

తాండ్ర కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రాంత ఆదివాసీ గిరిజనులకు ఉద్యోగాల్లో 100 శాతం నియామకం కల్పించే జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయడం అన్యాయం అన్నారు. ఈ జీఓ రద్దును సుప్రీంకోర్టు పున: పరిశీలించి, పునరుద్ధరించాలని కోరారు. ఆదివాసి గిరిజనులకు న్యాయం చేయాలనీ, వారి ఉద్యోగాల రక్షణకు పార్లమెంటు వెంటనే చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కుల రక్షణకు, వారి ఉద్యోగ భద్రత కోసం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఈ నెల 6‌న ఎంసీపీఐ (యూ) ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు తమ ఇళ్లల్లో ఉండి నిరసన తెలపాలని పార్టీ సభ్యులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్ల‌కార్డు‌లపై ఆదివాసీ ఉద్యోగ నియామకాల జీవో నెం.3‌ను సుప్రీంకోర్టు పున: పరిశీలించాలనీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగాల రక్షణకు సుప్రీంకోర్టు‌లో రాష్ట్ర ప్రభుత్వాలు రిట్ పిటిషన్ వేయాలనే డిమాండ్లను ప్రదర్శించాలని తెలిపారు.

Tags: GO No.3, adivasi tribal, welfare, jobs, restructure, mcpi(u) leaders, people, protest

Advertisement

Next Story