అప్పుల ఊబిలో తెలంగాణ

by Shyam |   ( Updated:2021-02-07 14:18:52.0  )
అప్పుల ఊబిలో తెలంగాణ
X
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. ఇప్పటికే రూ. 2.03 లక్షల కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ పవర్​ఫైనాన్స్​ కార్పొరేషన్​ నుంచి గడచిన నాలుగేళ్లలో రూ. 51,681 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని వాస్తవానికి విద్యుత్​ అవసరాలకు వినియోగించాలనే నిబంధనను తుంగలో తొక్కారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం తన తాజా నివేదికలో నిధుల మళ్ళింపు జరిగిందని వ్యాఖ్యానించింది. ఆ మళ్లింపు ఈ నిధులకు సంబంధించిందేనా..? అన్నది తేలాల్సి ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రతి ఏటా చేస్తున్న అప్పులు మోయలేని భారంగా మారుతున్నాయి. 15వ ఆర్థికసంఘం, రిజర్వుబ్యాంకు రూపొందించిన ‘స్టేట్ ఫైనాన్స్’ నివేదిక ఇదే చెప్తున్నది. ఈ అప్పులకు తోడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి కూడా గడచిన నాలుగేళ్లలో రూ. 51,681 కోట్లను రుణంగా తీసుకున్నది. ఇప్పటికే రూ. 2.03 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకున్న తెలంగాణకు ఇవి కూడా అదనంగా తోడయ్యాయి. దేశం మొత్తం మీద పీఎఫ్‌సీ వివిధ రాష్ట్రాలకు, సంస్థలకు ఈ నాలుగేళ్లలో ఇచ్చిన రుణం రూ. 2.60 లక్షల కోట్లుకాగా ఇందులో దాదాపు ఇరవై శాతం ఒక్క తెలంగాణ రాష్ట్రానివే కావడం గమనార్హం.

విద్యుత్ అవసరాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం హడ్కో, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) తదితర సంస్థల నుంచి కూడా తెలంగాణ రుణాలను తీసుకున్నది. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పై వివరాలను పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదలు 2020 డిసెంబరు 31వ తేదీ వరకు తెలంగాణకు మొత్తం రూ. 67,524 కోట్లు మంజూరు కాగా అందులో రూ. 51,681 కోట్లు విడుదలయ్యాయి. పీఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణాలను విద్యుత్ అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయాలన్నది సాధారణ నిబంధన. కానీ తెలంగాణలో ఆ నిధుల వినియోగానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉన్నది.

15వ ఆర్థిక సంఘం తన తాజా నివేదికలో నిధుల మళ్ళింపు జరిగిందని వ్యాఖ్యానించింది. ఇది పీఎఫ్‌సీ నిధుల వినియోగం విషయంలోనే అన్న సందేహం కలుగుతున్నది. పీఎఫ్‌సీ నుంచి ఏ మేరకు రుణం తీసుకున్నది స్పష్టమైన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించకపోవడంతో ఏ అవసరాలకు ఏ సంవత్సరం ఎంత తీసుకున్నారన్నది అస్పష్టంగానే మిగిలిపోయింది. కానీ పీఎఫ్‌సీ నుంచి ఏ సంవత్సరం ఎంత మొత్తంలో తెలంగాణకు ఆర్థిక సాయం చేసిందన్నది పార్లమెంటు వేదికగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున తెలంగాణ ఇంకెంత మొత్తంలో రుణం తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ రుణాలపై విధించే వడ్డీ రేటు ఏడాది, మూడేళ్లు, పదేళ్లు ఇలా ఆప్షన్​ను బట్టి మారే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed