- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ ఈ పనులు చేస్తే.. ఉల్లంఘించినట్లు కాదా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కాంగ్రెస్, బీజేపీ సభలకు ఫ్లెక్సీలు పెట్టినందుకు వేలకు వేలు జరిమానా వేసి, వెంటనే తొలగించిన GHMC అధికారులు.. ఇప్పుడు మాత్రం వేడుక చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో ముంచేసింది. ప్రతీ కూడలి దగ్గర లీడర్లు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పెద్ద ఫ్లెక్సీలతో జిగేల్ మనిపిస్తున్నారు. నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటుపై మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గతంలోనే హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌కు కొంతమంది ట్వీట్ చేయడంతో అధికారులు మంత్రి తలసానికి రూ.50 వేల ఫైన్ విధించినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. ఇక గతంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు లక్షల రూపాయల జరిమానా విధించారు. అంతేగాకుండా బీజేపీ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తొలిగించి, జరిమానా విధించారు. కానీ. ఇప్పుడు టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలపై మౌనంగా చూస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపడాన్ని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం బీఆర్కే భవన్ వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జనవరి ఒకటి నుంచి నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేధమన్న మంత్రి కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయన్న కేటీఆర్ గత వ్యాఖ్యలను కమలనాథులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవటానికే ఫ్లెక్సీలను కేటీఆర్ ఏర్పాటు చేయించుకున్నాడా? అని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌కు మినహాయింపు ఇచ్చి ఇతర పార్టీలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా? అని నిలదీశారు. వివిధ విగ్రహాలకు కూడా టీఆర్ఎస్ తోరణాలను కట్టడాన్ని బీజేపీ ఆక్షేపిస్తోంది.
కేటీఆర్ గారు.. ఇదేంది
‘‘రాజకీయ నాయకులు తమ ముఖాలను తాము చూసుకోవడానికే ఫ్లెక్సీలు పనికొస్తాయి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్స్ కారు. ప్లాస్టిక్ అనేది భూతం. అది మనల్ని వెంటాడుతుంది. దానిపై యుద్ధం చేయాలి. ఫ్లెక్సీలు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. వాటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెట్టినా సరే! ఫ్లెక్సీలు పెట్టినందుకు (ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్)కు రూ.లక్ష ఫైన్ వేస్తున్నా’’.. గత ఏడాది మార్చి 2న ఇల్లందు పర్యటన సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు మాత్రమే కాదు.. తర్వాత కూడా పలుమార్లు ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీల వాడకం చాలా పెరిగిపోయిందని, ఈ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. GHMC పరిధిలో పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పలువురు కార్పొరేటర్లకు జరిమానా వేయాలని పలుమార్లు ఆదేశించారు. ‘‘కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. జనవరి ఒకటి నుంచి నగరంలో గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కనిపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘనకు పాల్పడితే అధికార పక్షం వారినీ సైతం వదలం’’ అని అధికారులకు తేల్చి చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. దీనికి మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.