ఇక హైదరాబాద్‌లోనూ మారుతీ సుజుకి వెహికల్ సబ్‌స్క్రిప్షన్

by Harish |
ఇక హైదరాబాద్‌లోనూ మారుతీ సుజుకి వెహికల్ సబ్‌స్క్రిప్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ఇటీవల వెహికల్ సబ్‌స్క్రిప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తొలుత ఢిల్లీ, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితం చేయగా, తాజాగా దీన్ని హైదరాబాద్, పూణె నగరాలకు కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ పథకం ద్వారా వాహనదారులు కారును నేరుగా కొనుగోలు చేయకుండా ప్రతి నెలా నిర్వహణ ఛార్జీలను చెల్లించే వీలుంటుంది. మారుతీ సుజుకి సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా కారు తీసుకున్న వ్యక్తి ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కారు నిర్వహణ, ఇన్సూరెన్స్ వంటివన్నీ కంపెనీయే భరిస్తుంది. కానీ, ఆ ఛార్జీలను వినియోగదారుల నెలవారీ చెల్లింపుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం మారుతీ సుజుకి జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసె ఇండియా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు మారుతీ సుజుకికి చెందిన స్విఫ్ట్, విటారా బ్రెజా, ఎర్టిగా, బలెనో, ఎరీనా, డిజైర్, సియజ్, ఎక్స్ఎల్6 మోడళ్లను తీసుకోవచ్చు. ఏ మోడల్‌ను తీసుకుంటారో ఆ కారు ధరను బట్టి నెలవారీ చెల్లించే మొత్తంలో బేధాలుంటాయి. ఉదాహరణకు, హైదరాబాద్‌లో స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ కనిష్ట నెలవారీ మొత్తం రూ. 15,354గా ఉంది. దీనిద్వారా వినియోగదారులు ఏడాది నుంచి 4 ఏళ్ల పాటు కారును సబ్‌స్క్రైబ్ చేసుకునే వీలుంటుంది. కాగా, కంపెనీ రానున్న రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 60 పట్టణాలకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించింది.

Advertisement

Next Story