నో హెల్మెట్.. ట్రాఫిక్ చలానా కింద ‘మంగళసూత్రం’ ఇచ్చిన మహిళ

by Shamantha N |
mangal sutra
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వైవాహిక జీవితంలో మంగళ సూత్రానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. తమ వివాహ బంధానికి గౌరవ సూచికగా ఆడవాళ్లు తాళిబొట్టు పట్ల ఆరాధన భావాన్ని కలిగి ఉంటారు. సరదాకు కూడా దానిని మెడలో నుంచి తీయరు. ఒకవేళ తీయాల్సి వస్తే దానికి మంచి రోజులు, గడియలు చూస్తారు. అలాంటిది ఓ ఇండియన్ విమెన్ ట్రాఫిక్ చలానా కింద మంగళసూత్రాన్ని పోలీసులకు అప్పగించింది. అది కూడా భర్త పక్కన ఉండగానే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లాకు చెందిన విభూతి అనే 30 ఏళ్ల మహిళ భర్తతో పాటు మార్కెట్‌కు వెళ్లింది. ఆ సమయంలో వీరి వద్ద రూ.1800 ఉన్నాయి. మార్కెట్లో రూ.1700 విలువైన మంచాన్ని ఖరీదు చేశాక మిగిలిన రూ.100తో టిఫిన్ చేసి దంపతులిద్దరూ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. వాహనంపై వెళ్తున్న క్రమంలో విభూతి భర్త హెల్మెట్ ధరించలేదు. సిటీ బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వీరిని అడ్డగించారు. హెల్మెట్‌ లెస్ రైడింగ్‌ కింద రూ.500 జరిమానా చెల్లించాలని పోలీసులు కోరారు. తమ వద్ద డబ్బులు లేవని, మిగిలిన చివరి రూ.100లను అల్పాహారం కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు.

దీంతో ట్రాఫిక్ పోలీసులకు, విభూతి దంపతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దాదాపు రెండు గంటల వరకు కొనసాగగా.. ప్రజలు అక్కడే గుమిగూడారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన విభూతి కోపంతో తన ‘మంగళసూత్రాన్ని’ ట్రాఫిక్ పోలీసులలో ఒకరికి అప్పగించింది. ట్రాఫిక్ ఉల్లంఘన కింద దానిని అమ్మి జరిమానా తీసుకోవాలని ఆమె తెలిపింది. ఆ మహిళ తీరుతో ట్రాఫిక్ పోలీసులకు ఏమీ పాలుపోలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన సీనియర్ పోలీసు అధికారులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వివాదం సర్దుమణిగేలా చూశారు. అనంతరం దంపతులను అక్కడి నుంచి పంపించి వేశారు.

Advertisement

Next Story

Most Viewed