ఇరు వర్గాల కొట్లాట.. ఆజ్యం పోసిన ప్రేమ పెళ్లి.. ఒకరు మృతి

by Sumithra |
ఇరు వర్గాల కొట్లాట.. ఆజ్యం పోసిన ప్రేమ పెళ్లి.. ఒకరు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రేమ పెళ్లి ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్న చర్ల గ్రామానికి చెందిన వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ జంట ఆదివారం ఊరు నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టింది. ఆ యువతి కుటుంబీకులు అమ్మాయి కోసం ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో అదే రోజు అబ్బాయి కుటుంబీకులపై యువతి బంధువులు దాడి చేశారు.

ఈ ఘటనలో యువకుని అన్న, వదిన ఉష(40) పై కర్రలు, గొడ్డలితో దాడి జరగగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ గొడవ రెండు వర్గాల మధ్య పరస్పర దాడులకు కారణమైంది. గాయపడ్డ దంపతులను వారి సామాజిక వర్గానికి చెందిన వారు నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉష పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియడంతో దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా, చికిత్స పొందుతున్న ఉష చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు వీలుగా గ్రామంలో మరింత బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story