సరళ తరం ఇప్పుడేది!?

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:04:46.0  )
సరళ తరం ఇప్పుడేది!?
X

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడంతా 'విరాటపర్వం' సినిమా పైనే చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని సరళ నిజజీవిత కథపై తీసిన ఈ మూవీ మొన్నటి శుక్రవారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విప్లవ సానుభూతిపరులతో పాటు ఆలోచనాపరుల, నేటి తరం యువతీ యువకుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. వేణు ఊడుగుల దర్శకత్వ ప్రతిభకు, కథ పట్ల కమిట్మెంటుకు పట్టం కడుతూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రివ్యూలు వస్తున్నాయి. 1992లో ఇంటర్ చదువుతూ విప్లవ రాజకీయాలపైన, విప్లవకారులపైన అమితమైన ప్రేమతో వరంగల్, కరీంనగర్ జిల్లాలను దాటేసి నిజామాబాద్‌ జిల్లా సీర్నపల్లి అడవులకు వెళ్లిన సరళను ఇన్ఫార్మర్, కోవర్ట్ అన్న అనుమానంతో అన్నలు చంపడం అప్పట్లో బాగా వివాదాస్పదమైంది.

పోలీసుల కోసం పని చేస్తున్నదనే అనుమానాన్ని సంఘ మిలిటెంట్లు వ్యక్తం చేసినా, విచారణ సందర్భంగా ఎన్ని పరస్పర విరుద్ధమైన విషయాలు ఆమె చెప్పినా చంపడం అమానవీయమని, ఎవరినైనా ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు పంపిస్తే సరిపోయేదని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు గొంతెత్తారు. ఘటనను సమీక్షించిన అప్పటి పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ కొంచెం ఆలస్యంగానైనా తప్పు ఒప్పుకుంది. సరళను చంపడం తమ పార్టీ చేసిన మహాపరాధమని ప్రకటించి సరళ కుటుంబ సభ్యులను, ప్రజలను క్షమాపణలు కోరింది. బాధ్యుడైన అప్పటి జిల్లా కమిటీ కార్యదర్శి శంకర్‌ను తీవ్రంగా మందలించింది. ఆ పార్టీ చరిత్రలో ఇదంతా రికార్డయి ఉంది.

ప్రేమ కోసమని

వాస్తవ చరిత్ర తెలిసిన వాళ్లకు 'విరాటపర్వం' సినిమా చూసిన తర్వాత కొన్ని సందేహాలు రావడం సహజం. యుద్ధం మధ్యలోనే పుట్టే ప్రేమను కథావస్తువుగా తీసుకున్న దర్శకుడు ఆ అంశాన్ని బలోపేతం చేయడానికి చాలాసార్లు స్వేచ్ఛను తీసుకున్నారు. సినిమా ప్రారంభం నుంచీ క్లైమాక్స్ వరకూ ప్రేమ చుట్టూతానే కథ సాగింది. రవన్న రచనలను చదివిన వెన్నెల భావోద్వేగానికి గురవుతుంది. ఆయనతో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను పొందడానికి ఇంటిని వదిలి పయనమవుతుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అదే రవన్న చేతిలో హతమవుతుంది.

ఆమెను అర్థం చేసుకోలేక

ఇక నిజజీవిత సరళ అప్పటికే ఒక విప్లవ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేస్తున్నది. మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలను ఓ మేరకు ఒంటబట్టించుకుని, మరింత ప్రబలంగా, ఉధృతంగా పోరు సల్పుతున్న మరో నక్సలైట్ పార్టీ పీపుల్స్‌వార్‌లో చేరడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ అడవులకు చేరింది. ఆ జిల్లా కార్యదర్శి శంకర్ అప్పట్లో బాగా ఫేమస్ అయితే కావచ్చు కాక, ఆ పేరును నిత్యం పేపర్లలో సరళ చూసివుండవచ్చు గాక. అంతకు ఆరు నెలల ముందు ఆయన సహచరి జ్యోతక్క పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించి ఉండవచ్చు గాక. ఆయనతో ప్రేమలో పడి మాత్రమే అక్కడికి వెళ్లిందని చెప్పడం సినిమాటిక్‌గానే అనిపిస్తుంది.

ఎందుకంటే పార్టీలో, దళంలో చేరడానికే తను సీర్నపల్లి ప్రాంత గ్రామాలలో నెల రోజుల పాటు తిరిగింది. స్థానిక సంఘ మిలిటెంట్ల అభిమానాన్ని చూరగొంది. పేద ప్రజల ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి విప్లవమొక్కటే మార్గమని నమ్మింది. ఆ ఆదర్శ భావాలను అర్థం చేసుకోలేని శంకర్, సీర్నపల్లి ఏరియా కమిటీ సభ్యులు సరళను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.

ఏదీ నాటి చైతన్యం?

నిజానికి సరళ ఒక్కరే కాదు. 1970, 80 దశకాలలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులలో మెజారిటీ విప్లవాన్ని స్వప్నించారు. ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌ఓ, ఎస్‌యూసీఐ తదితర విద్యార్థి సంఘాలలో చేరి సామాజిక సమస్యలపై పోరాటాలు చేశారు. ఆ క్రమంలో కొందరు ఆయా పార్టీలలోకి ఫుల్ టైమర్లుగా వెళ్లి నాయకులుగా ఎదిగారు. అప్పట్లో ఏ కళాశాలను చూసినా విద్యార్థులలో చైతన్యం తొణికిసలాడేది. కేవలం తమ చదువుల గురించే కాకుండా తమ చుట్టూతా బతుకుతున్న వివిధవర్గాల ప్రజల గురించి ఆలోచించేవాళ్లు. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం తమ బాధ్యతగా ఫీలయ్యేవాళ్లు. అవసరమైతే అందుకోసం తమ జీవితాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడేవాళ్లు కాదు.

కేవలం వామపక్ష, నక్సలైటు భావజాలం కలిగినవాళ్లే కాదు, జాతీయత ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో నడిచే ఏబీవీపీ, కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ఎన్ఎస్‌యూఐ సంఘాలలో సైతం పెద్దయెత్తున విద్యార్థులు చేరి క్రియాశీలక రాజకీయాలలో పాలుపంచుకునేవాళ్లు. సామాజిక కార్యక్రమాలు చేపట్టేవాళ్లు. విద్యార్థుల సమస్యల పైనే కాకుండా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సైతం అర్థం చేసుకుని ఆచరణకు దిగేవాళ్లు.

వీటిలో అందరూ వారే

ఇలాంటి విద్యార్థి నాయకుల నుంచే ఆయా పార్టీలకు భవిష్యత్ నాయకులు తయారయ్యేవాళ్లు. ప్రస్తుత విప్లవ పార్టీలను చూసినా, సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలను చూసినా, బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను చూసినా, టీడీపీ, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను చూసినా మనకు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. టాప్ లెవెల్ లీడర్లలో దాదాపు అందరూ వీళ్ల నుంచి వచ్చినవాళ్లే ఉంటారు. లెఫ్ట్-రైట్-సెంటర్, ఏ పాలిటిక్స్ అయినా కావచ్చు. విద్యార్థులు తమ స్వార్థం చూసుకోకుండా సమాజం గురించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం అప్పటి తరం నైజంగా ఉండేది.

లోపించిన మానవీయత

మరి ఇప్పుడో? ఏ స్కూలుకు వెళ్లినా, మరే కాలేజీకి వెళ్లినా కేవలం తమ చదువుల గురించి, కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించే విద్యార్థులు మాత్రమే తటస్థపడతారు. వాళ్లకు పుస్తకాలే లోకం. తమ లైఫే ఇంపార్టెంట్. తల్లిదండ్రులు సహా చుట్టుపక్కలవాళ్లు, సమాజం ఎలా ఉన్నా, ఎటు పోయినా అవసరం లేదు. ఒకరు ఇంజనీరింగ్ చేసి ఏ అమెరికాకో, ఏ యూరప్‌కో వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్ ప్యాకేజీలు కొట్టేసి లైఫ్‌లో సెటిల్ కావాలనుకుంటారు. మరొకరు ఎంబీబీఎస్ సీటు కోసం రేయింబవళ్లు నిద్ర మానేసి చదువుతుంటారు. ఏడెనిమిదేళ్లు కష్టపడి ఒకసారి డాక్టర్ అయితే, ఇక డబ్బులే డబ్బులని కలలు కంటుంటారు. ఇంకా కొందరు సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చేస్తూ, సివిల్స్ కోసం ప్రయత్నిస్తూ విజయానికి ఇంకా ఎన్ని మెట్లున్నాయో వెతుకులాటలో ఉంటారు.

అందరి టార్గెట్ ఒక్కటే. లెక్కలేనంత డబ్బు సంపాదించడం, సుఖాలను అనుభవించడం. రిస్క్ లేకుండా, కష్టపడకుండా బతకడం. రోడ్డుపై వెళుతుంటే ఏదో యాక్సిడెంట్ అయి ఒకరు గాయాలతో విలవిలలాడుతుంటే వీళ్లకు అక్కర్లేదు. ఇద్దరు వ్యక్తులు పరస్పరం చంపుకోబోతుంటే వీళ్లు వెళ్లి ఆపరు. బస్టాప్‌లో పోకిరీలు ఓ అమ్మాయిని వేధిస్తుంటే అటువైపు చూడరు. తిండి లేక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడుక్కునే అనాథలు, అభాగ్యులు వీళ్లకు కనిపించరు. అంతెందుకు? తమలోనే కొందరికి అన్యాయం జరిగినా, ఉద్యోగాలు పోయినా వీరికి పట్టింపు వుండదు. సమాజం ఎటు పోతోందో వీళ్లసలు ఆలోచించరు. కేవలం తను, తన ఫ్యామిలీ బాగుంటే చాలనుకుంటారు.

అందుకు కారణం ఇదే

1990లలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల మూలంగానే ఈ మార్పు జరిగింది. ఓ వైపు సాంకేతిక విప్లవం బద్దలు కావడం, మరోవైపు పశ్చిమ దేశాల పెట్టుబడులకు, సంస్కృతికి తలుపులు బార్లా తెరుచుకోవడం వల్ల యువతలో క్రమంగా కెరీరిజం, స్వార్థం, విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరిగింది. మార్క్స్, లెనిన్‌, మావోలనే కాదు, గాంధీ, నెహ్రూ, సావర్కర్‌నూ, చివరకు జాతీయతను, భరతమాతనూ మరిచిపోయే స్థితికి వచ్చారు.

ఆ తరం వస్తుందా?

ఈ ఆపద నుంచి దేశాన్ని కాపాడాలంటే మరోమారు సరళ తరం రావాలి. తమ కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించే శక్తులు ఉద్భవించాలి. కళాశాలలు ఉత్తేజ కేంద్రాలుగా మారాలి. భవిష్యత్ నేతలు అక్కడి నుంచే తయారుకావాలి. అప్పుడే దేశం స్వార్థపరుల, అవకాశవాదుల, మూర్ఖుల, నియంతల పాలనలోకి వెళ్లదు. 'విరాటపర్వం' స్ఫూర్తిగా ఆ మార్పునకు బీజం పడాలి.

చివరగా, సరళ సోదరుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించి ముగిస్తాను.

'నేటి విద్యార్థి నేతలే రేపటి దేశ నాయకులంటారు. భవిష్యత్ నేతలను తయారుచేసే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సెల్ఫ్ సెంటర్‌డ్, కెరీరిస్ట్ యంత్ర మానవులను సృష్టించే కార్ఖానాలుగా తయారు కావడం విషాదకరం. ఇప్పటికే రాజకీయాలు బాగా చెడిపోయాయి. ఇలాగే వదిలేస్తే భ్రష్టుపట్టిపోవడం ఖాయం. అందుకే కాలేజీలను మళ్లీ చైతన్యవంతం చేయాలి. సైన్స్, కామర్స్ కోర్సులతో పాటు ఆర్ట్స్ కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. కళాశాలలలో ఎన్నికలు జరిపే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.'

డి. మార్కండేయ

[email protected]

Advertisement

Next Story