- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోకోణం:గజం మిథ్య.. పలాయనం మిథ్య!
దేశ స్థితిగతులను మార్చాలంటే పాలనను ప్రగతిపథంలోకి తీసుకుపోయే కొత్త ఎజెండా అవసరమని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఉద్భవించాలని నాలుగు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు చాలా ఫ్రంట్‌లు వచ్చాయని, ఇప్పుడు కావాల్సింది కొత్త రాజకీయ గుంపు, కూటమి కాదని నొక్కి చెప్పారు. కొన్ని పార్టీలను, కొంతమంది ముఖ్యమంత్రులను కలుపుకుపోయినంత మాత్రాన ఫలితం లేదని, నూతన ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు రావాలని, ప్రతివాడూ చేయడానికి పని దొరకాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలా వ్యాపిస్తే, అది మనందరికీ గర్వకారణమని అన్నారు. ఇందుకోసం తాను ఒక సైనికుడిలా పనిచేస్తానని, భారతదేశాన్ని అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా తయారుచేస్తానని తెలిపారు. త్వరలోనే దేశవిదేశాల ఆర్థికవేత్తలతో, హార్వర్డ్ యూనివర్సిటీ మేధావులతో, అఖిల భారతీయ సర్వీసుల అధికారులతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి(?)గా చేయడానికి ఆలోచనలు జరుగుతున్నాయన్న సంకేతాలను కూడా ఇచ్చారు. బందీగా ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన తరహాలోనే బాధల భారతాన్ని బంగారు భారతం చేస్తామని చెప్పారు. దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాలలో టీఆర్ఎస్ కీలక భూమిక నిర్వహించాలంటూ కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 'దేశ్ కీ నేతా కేసీఆర్' అన్న నినాదాల హోరుతో సమావేశం ముగిసింది.
మంచి మాటలతో
కేసీఆర్ స్పీచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించినా, కేటీఆర్ సహా ప్లీనరీలో ప్రసంగించిన, తీర్మానాలు ప్రవేశపెట్టిన మంత్రులు, నేతలందరూ మాట్లాడిన విషయాలను చూసినా మనకు కొన్ని అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన ఏ పార్టీ, ఏ కూటమి కూడా సరైన ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయిక విధానాలను అనుసరించలేదని. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న విస్తృత వనరులను ప్రజల బాగోగుల కోసం వాడుకోలేదని. దేశ ప్రయోజనాలను విదేశీ సంస్థలకు, దేశీయ అంబానీ-అదానీలకు తాకట్టు పెట్టాయని. పాలనా వ్యవస్థలను భ్రష్టు పట్టించాయని. తమ స్వార్థ, అవకాశవాద రాజకీయ ప్రయోజనాలకు దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయని. అలాంటి పార్టీలు, ఫ్రంటులు ఎంతమాత్రం పనికిరావని. ఈ పార్టీలకు, ఫ్రంటులకూ ఉన్న బలహీనతలు, లోపాలు లేని ఒక కొత్త రాజకీయ శక్తి అవసరమున్నదని. ఆ రాజకీయ శక్తిని తయారుచేయడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నదని. అవసరమైతే రాజ్యాంగాన్ని సైతం మార్చి దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని. ఇలా బోలెడు మంచి మాటలు చెప్పారు.
ఇంకా అలాగే ఉంది
ఈ మాటలు విన్న ఎవరికైనా కేసీఆర్‌లో మరోమారు ఉద్యమస్ఫూర్తి కనిపిస్తుంది. పదమూడేండ్లు కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని, ఎనిమిదేండ్లు పాలించి బంగారు తెలంగాణను సాధించిన రీతిలోనే ఆయన రేపు బంగారు భారతాన్ని కూడా సాధిస్తారేమోననే ఆశాభావం కలుగుతుంది. కానీ, మాటల గారడీ చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలుసు. ఆయన మాటలకు, చేతలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా ఇంకా తెలంగాణ బంగారు తునకగా మారలేదు. 'నీళ్లు, నిధులు, నియామకాలు' నినాదం సశేషంగానే మిగిలింది. అన్ని జిల్లాలకు నీళ్లు ఇప్పటికీ కలగానే ఉంది. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ తదితర ఉమ్మడి జిల్లాలలోని మెట్టప్రాంతాల రైతుల కరువు ఇంకా తీరలేదు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినా ఆ లిఫ్టుల నుంచి నీళ్ల కంటే కమీషన్లే ఎక్కువ ఎత్తిపోశారంటున్నారు. రైతుబంధు ఇచ్చినా సేద్యం గిట్టుబాటు కాక ఇప్పటికీ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూనే వున్నారు.
హామీలు నెరవేరలే
తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పే కేసీఆర్ మరోవైపు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 67 వేల కోట్లుగా ఉన్న అప్పులు ఈ ఎనిమిదేండ్ల కాలంలో 3 లక్షల 30 వేల కోట్లకు పెరిగాయి. 2022-23 బడ్జెట్‌లో సుమారు రూ. 19 వేల కోట్లను కేవలం వడ్డీల చెల్లింపులకే కేటాయించారు. పంచాయతీలు, పట్టణాలలో బిల్లులు రాక, నిధులు లేక అనేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఇక ఉద్యోగ నియామకాలు జరగక నిరుద్యోగులు నిప్పులై మండుతున్నారు. ఆ మంటలను చల్లార్చడానికి ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం ఆరంభించింది. సంక్షేమ పథకాల విషయానికి వచ్చినా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తప్ప టీఆర్ఎస్ హామీలేవీ సంపూర్ణంగా నెరవేరలేదు.
దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, అణగారిన వర్గాలకు సబ్సిడీ రుణాలు, ఉచిత ఎరువులు వంటి హామీలలో కొన్ని పాక్షికంగానే అమలు కాగా, మిగతావి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రంలోని ప్రతి ఎస్‌సీ కుటుంబానికీ అందజేస్తామని వాసాలమర్రిలో సీఎం ప్రకటించిన దళితబంధు పథకం చివరకు నియోజకవర్గానికి వంద కుటుంబాలకే పరిమితమైంది.
ఆస్తులు, అంతస్థులు పెంచుకుని
ఇక ప్రస్తుతం ఉన్న పార్టీలు, కూటములు అవకాశవాద రాజకీయాలు అవలంబిస్తున్నాయన్న, అవి దేశ ప్రగతికి ఎంతమాత్రం పనికిరావన్న అంశాలను చూద్దాం. ఇలా చెప్పడంలో కేసీఆర్ ఉద్దేశం కేవలం టీఆర్ఎస్ మాత్రమే ఇందుకు మినహాయింపని. కాని ఈ ఎనిమిదేండ్లలో స్వయంగా కేసీఆరే కావాలని తన పార్టీని ఉద్యమ సంస్థ నుంచి ఫక్తు రాజకీయపార్టీగా మార్చేశారు. ఆ విషయాన్ని ఆయన పబ్లిక్‌గానే చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల సంస్కృతిని తలదన్నే పద్ధతులను అవలంభించారు. ఆయారాం, గయారాంల విషయంలో భజన్‌లాల్‌ను మించిపోయారు.
అవకాశవాద ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ లెజిస్లేచర్ పార్టీలను మింగేశారు. నైతికవిలువలను కాలదన్ని తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన ఎందరినో పార్టీలో చేర్చుకున్నారు. వారికి కీలక పదవులు కట్టబెట్టారు. అలాగే మిగతా పార్టీలలాగే సంస్థాగత ఆస్తులు పెంచుకున్నారు. టీఆర్ఎస్‌ను రూ. వేయి కోట్ల స్థాయికి తీసుకెళ్లారు. కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాలనలో, ప్రభుత్వాధికారులలో అవినీతి పెరిగింది. పోలీసు, ప్రభుత్వ అధికారుల బదిలీలలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల రూపంలో పెద్దయెత్తున డబ్బు చేతులు మారుతోంది. కాగా, లోకల్ అంబానీ-అదానీలుగా పేరున్న మేఘా-మైహోం కనుసన్నలలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందనే టాక్ తెలంగాణలో ఉంది.
ఇప్పుడు వారిదే హవా
అయినప్పుడు మిగతా పార్టీలతో పోల్చితే టీఆర్ఎస్ విభిన్నం ఎలా అవుతుంది? ప్రత్యామ్నాయ ఎజెండాను ఎలా రూపొందించగలుగుతుంది? దేశాన్ని కొత్త తరహాలో ఎలా అభివృద్ధి చేయగలుగుతుంది? అన్నవి వేయి కాదు కోటి డాలర్ల ప్రశ్నలు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన నేతల హవానే నడుస్తోంది. 2001లో పార్టీ ఆవిర్భవించినప్పుడున్న నేతలు, ఉద్యమ స్ఫూర్తి కలిగినవాళ్లు ఇప్పుడు వేళ్ల మీద లెక్కబెట్టదగిన సంఖ్యలోనే ఉన్నారు. ఈ పరిస్థితులలో 'దేశ్ కీ నేతా కేసీఆర్' ఎవరిపై ఆధారపడి కొత్త ప్రత్యామ్నాయ శక్తిని తయారుచేస్తారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఇప్పుడున్న ఏ పార్టీతో, మరే కూటమితో కలువకుండా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండ లేకుండా ఆయన సాధించేదేమిటో కూడా అర్థం కాదు. ప్రపంచ నిపుణులను రప్పించినా, దేశంలోని మేధావుల సలహా తీసుకున్నా, ఒక రాజకీయ పార్టీగా, అదీ జాతీయ పార్టీగా మనగలగాలంటే, ఓట్లు రాబట్టాలంటే, విజయం సాధించాలంటే ఏ సిద్ధాంతాలను పాటించాలో, ఏ నైతిక విలువలను అనుసరించాలో మనందరి కంటే కేసీఆర్‌కే ఎక్కువ తెలుసు.
చివరకు మిగిలేది
చివరగా ఒక కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు తమ శిష్యులతో ఒక అడవిని దాటుతున్నారట. ఒక ఏనుగు వారి వెంటపడి తరమగా, శంకరులవారు సహా అందరూ భయంతో పరుగులెత్తారట. అప్పుడు ఒక శిష్య పరమాణువు ఆదిశంకరుల వారిని సందేహంగా ఇలా అడిగారట. 'గజం మిథ్య' కదా.. పరుగెత్తడం ఎందుకూ? అని. దానికి శంకరుల వారు ఇలా సమాధానమిచ్చారట. 'గజం మిథ్య.. పలాయనం కూడా మిథ్యే'' అన్నారట. అంటే బంగారు తెలంగాణ.. బంగారు భారతం.. రెండూ మిథ్యేనా! లేక నిజమా!
-డి మార్కండేయ
editor@dishadaily.com