- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపారులకు సహకారం.. రైతుల కంట్లో కారం
– ఆన్‌లైన్ ట్రేడ్‌లో నిజామాబాద్ వ్యాపారులదే హవా
దిశ, నిజామాబాద్:
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలక వర్గం లేకపోవడం, ఉద్యోగులు తాత్కాలిక ప్రాతిపాదికన పనిచేస్తుండటం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే.. గిట్టుబాటు ధర అటుంచి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ-నామ్ ద్వారా జరిగే ట్రేడింగ్‌లో దళారీ వ్యవస్థ ఉండదని, నాణ్యమైన సరుకుకు మంచి ధర వస్తుందని నమ్మి మార్కెట్‌కు వచ్చే రైతులు మోసపోతున్నారు. ఆన్‌లైన్ ట్రేడ్‌లో ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఆన్‌లైన్ వ్యవస్థ అంతా కూడా నిజామాబాద్ వ్యాపారులకు అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ అనేది ఉత్తి మాటగానే మారింది. నిజామాబాద్ వ్యాపారులు చెప్పిన ధరనే ఆన్‌లైన్‌లో రావడంతో పాటు ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల వరకే ఆన్‌లైన్ ట్రేడ్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో నిత్యం వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చినా ట్రేడ్ జరగని పరిస్థితి. అంతేకాకుండా ఈ మార్కెట్‌లో కొంత మేరకు మాత్రమే సరుకుకు రూ.6 వేల ధర పలుకుతుండగా.. ఎక్కువ శాతం ధర రూ. 5 వేలు మించకపోవడం మార్కెట్‌లో రైతుల నిలువు దోపిడీకి ఉదాహరణగా చెప్పవచ్చు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ-నామ్ ద్వారా క్రయ విక్రయాలకు ప్రసిద్ధి. 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి దేశంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా అవార్డును పొందింది. ఈ నామ్ ద్వారా నేరుగా కొనుగోలు కేంద్రంలో మార్కెట్ కమిటీ సిబ్బంది ఆధ్వర్యంలో లావాదేవీలు జరుగుతాయి. రైతులు నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్‌కు సరుకు లాట్ నంబర్, ఇ-ట్రేడింగ్‌లో సరుకు ధర, తూకము విలువ మెసేజ్ రూపంలో వెంటనే పంపుతారు. కాబట్టి రైతులకు ఈ నామ్ ద్వారా జరిగే ట్రేడింగ్‌లో పోటీ ధర తెలుస్తుంది. అమ్మకం జరిగిన వెంటనే చెక్ లేదా ఆన్‌లైన్ ద్వారా రైతులకు వారి సరుకుల డబ్బులు చెల్లిస్తారు. అయితే దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఈనామ్ వ్యవస్థ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పక్కదారి పడుతోంది. తెలంగాణలో నిజామాబాద్, మలక్ పేట్, వరంగల్, బాదెపల్లి, తిరుమలగిరిలో మాత్రమే ఈ నామ్ వ్యవస్థ ఉంది. నిజామాబాద్‌లో సోయాబీన్, మక్కలు, మినుములు, పసుపు క్రయ విక్రయాలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. నిత్యం 20 వేల క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వస్తుంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది దాదాపు 40 వేల హెక్టార్లలో పసుపు పండించగా.. సుమారుగా 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
జిల్లాలో 120 మంది వ్యాపారులు మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా ట్రేడ్‌లో పాల్గొంటున్నారు. వారే మార్కెట్ ధరను నియంత్రిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సెలెక్షన్ గ్రేడ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న మార్కెట్ యార్డుకు మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తున్నా.. రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి వ్యాపారుల ద్వారా కొనుగోలుకు సంబంధించిన మామూళ్లు వసూలు చేస్తాడని, అతడు చెప్పినట్లే మార్కెట్ ధర అమలు చేస్తున్నారని రైతులు, మార్కెట్ వర్గాల భోగట్టా. ఆన్‌లైన్ ట్రేడింగ్ రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య కొనసాగేందుకు వ్యాపారులతో జరిగిన పరస్పర ఒప్పందమే కారణమని మార్కెట్‌లో అంతా చర్చించుకుంటున్నారు. కొన్నేండ్లుగా మార్కెట్ కమిటీలో శాశ్వత నియమాకాలు లేక పాలక వర్గాలకు సంబంధించిన వారినే నియమించారని, ప్రస్తుతం వారే మార్కెట్‌ను శాసిస్తున్నారు. కొందరు పేరుమోసిన వ్యాపారులు సరుకును జీరో రూపంలో క్రయ విక్రయాలు చేస్తారని పేరుంది. తూకంలో తప్పిదాలకు దాడ్వాయిలను బలి చేసే మార్కెట్ కమిటీ అధికారులు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో జరుపుతున్న దందాకు మాత్రం అడ్డు చెప్పడం లేదు. దీంతో రైతులు ప్రతిసారి మోసపోవడం..ఈ నామ్ నిర్వహణపై నీలీ నీడలు కమ్ముకుంటున్నాయి.