- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు ఐదు అడ్డంకులు
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ ద్వారా నష్టాలను పూడ్చుకుందామని బీసీసీఐ భావిస్తున్నది. కానీ, ఒకరోజు ఒకడుగు ముందుకు వేస్తే మరోరోజు రెండడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఐపీఎల్ నిర్వహించాలని భావించినా అనేక అడ్డంకులను బీసీసీఐ దాటాల్సి ఉంది. ఒకవైపు పీసీబీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఐపీఎల్‌పై అనుమానాలు సృష్టిస్తుండగా బీసీసీఐలో పరిపాలన సజావుగా సాగకపోవడం పెద్ద లోపంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరగాలంటే ముందు ఐదు అడ్డంకులు తొలగించుకుని ముందుకెళ్లాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐసీసీ నిర్ణయం ఏమిటి?
టీ20 వరల్డ్ కప్ వాయిదా పడుతుందా లేక కొనసాగిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. ఈ అంశంపై జూలై రెండో వారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకోనున్నది. ఆ నిర్ణయం తర్వాతే ఐపీఎల్ ఎప్పుడు ఆడాలనే విషయం ఆధారపడి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ నిరాసక్తతను వెల్లడించింది. కానీ, ఐసీసీ మాత్రం నిర్ణయం తీసుకోలేదు. టీ20 వరల్డ్ కప్‌పై ఏదో ఒక నిర్ణయం వస్తే ఐపీఎల్‌కు ఉన్న పెద్ద ఆటంకం తొలిగినట్లే.
వేదికెక్కడ?
టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే ఐపీఎల్ ఎక్కడ నిర్వహించాలనేది మరో ప్రధాన సమస్య. ముంబయిలో నాలుగు అంతర్జాతీయ స్టేడియాలు ఉన్నాయి. ఆ నాలుగుంటినీ బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచి ఐపీఎల్ నిర్వహించాలని భావించారు. కానీ, మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండటంతో వేదిక ఎక్కడ అనే అంశం మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటుండగా అదే సమయంలో ఆసియాకప్ శ్రీలంకలో నిర్వహిస్తామని పీసీబీ చెబుతున్నది. ఇక మిగిలింది యూఏఈనే. అక్కడ స్టేడియాల సంఖ్య చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కోసం స్టేడియాలను వెతకడం మరో తలనొప్పిగా మారింది.
స్టార్ ఇండియా ఒప్పుకుంటుందా?
ఐపీఎల్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ గత వారం చెప్పారు. అయితే, ప్రస్తుత మార్కెట్ మాత్రం ఐపీఎల్‌కు అనుకూలంగా లేదని తాజాగా వెల్లడించారు. ‘గతంలో ఐపీఎల్ సమయంలో ప్రకటనలు ఇవ్వడానికి అడ్వర్టైజర్లు చాలా ఉత్సాహం చూపించే వాళ్లు. కానీ, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. అన్నిరంగాలను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. మరో ఎనిమిది వారాల వరకు పరిస్థితి ఇలాగే ఉంటే ఐపీఎల్‌ను మేం ప్రసారం చేయలేం. ఆదాయం లేకుండా ఎదురు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. మాకు నష్టాన్ని తిరిగి ఇస్తామంటే ముందుకొస్తాం. లేకుంటే లేదు’ అని స్టార్ గ్రూప్ చెబుతున్నది. ఆ నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయలేకపోతే స్టార్ ముందుకు వస్తుందా అనేది ప్రశ్నార్థకమే.
అంతర్జాతీయ ప్రయాణాల మాటేమిటి?
అన్ని మార్గాలు సుగమమైనా అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే కాని ఐపీఎల్‌కు అతిపెద్ద అడ్డంకి తొలగిపోదు. యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహిస్తే ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర అధికారులు అందరూ కలిపి మూడు వేల మంది అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇండియాలో నిర్వహించాలనుకున్నా దాదాపు 1000మంది ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత తిరిగి క్వారంటైన్ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవాలి. సెప్టెంబర్ నెలలో అది సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా?
ఐపీఎల్ కోసం మిగిలిన అడ్డంకులు తొలగినా ప్రస్తుతం ఇండియాలో ఇంత పెద్ద లీగ్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది మరో సమస్య. ఇప్పటికే దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జన సమూహాలు గుమికూడే ఆడిటోరియాలు, స్టేడియాలు, థియేటర్ల, ప్రార్థనా మందిరాలు ఇంకా తెరుచుకోలేదు. కనీసం 25శాతం ప్రేక్షకులకు అనుమతించినా 10వేల మంది వస్తారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
మరోవైపు అతి తక్కువ సమయంలో ఫార్మాట్‌ను కుదించి లీగ్ నిర్వహించాలనే ప్రతిపాదనను గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజీల ముందు ఉంచింది. దీనివల్ల కొన్ని ఫ్రాంచైజీలు నష్టపోయే అవకాశం ఉంది. దీనికివాళ్లు ససేమిరా అంటున్నారు. 45 రోజులపాటు ఐపీఎల్ నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని బీసీసీఐ అంటున్నది. ఇలా అనేక అడ్డంకులను దాటి ఐపీఎల్ నిర్వహణ సాధ్యమా అంటే కాలమే నిర్ణయించాలి.