సమస్యలు యథాతథం… హామీలు శాశ్వతం

by Shyam |
సమస్యలు యథాతథం… హామీలు శాశ్వతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పలు సమస్యలు దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. వాటిని పరిష్కరించేవారు ఉండరు. ఎన్నికల సమయంలో నాయకులకు ఇవే ఓట్లు కురిపిస్తాయి. వాటిని పరిష్కరిస్తామంటూ నాయకులు చేసే ప్రసంగాలపై ఆ సమస్యలే చప్పట్లు కురిపించేలా చేస్తాయి. ఇంకేముంది ఆ హామీలు ఇచ్చిన నాయకులకే దాదాపు ఓట్లన్నీ పడతాయి. ఐదేండ్లు గడిచినా సమస్యలు యథాతథం. మళ్లీ ప్రచారం కోసం వస్తారు. ఈ సారి తప్పకుండా పరిష్కరిస్తామని, మరోసారి అవకాశమివ్వాలని బతిమిలాడి రోడ్ షో, ప్రచార సమయంలో పార్టీ పెద్దలతో హామీలిప్పిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు దశాబ్దకాలంగా ఒకరు కాకుంటే మరొకరు సమస్యల పరిష్కారం పేరుతో ఓట్లు దండుకుంటున్నారే తప్ప వాటికి పరిష్కార మార్గం చూపడం లేదు. ఇప్పటి ఎన్నికల హామీలు ప్రజలకేం గుర్తుంటాయని అనుకుంటున్నారు నాయకులు. పాత హామీలతోనే నాయకులు తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘మీ ఇంటి స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.. మీ చేతికి పట్టాలిప్పిస్తాం.. మీ స్థలాల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తాం.. వివాదాస్పద స్థలాలకు పరిష్కారాన్ని చూపిస్తాం..’ అంటూ ఆచరణ సాధ్యం కాని హమీలను కుమ్మరిస్తూనే ఉన్నారు. మరి ఓటర్లు ఈ సారీ ఆ హామీలను నమ్మి బోర్లా పడతారా? లేక ఓటుతో నాయకులకు బుద్ధి చెబుతారో వేచి చూడాలి.

వేల ఓట్లు కుమ్మరించే హామీలివే..
హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు అత్యంత సమీపంలోని వందలాది ఎకరాల గురుకుల్ ఘట్‌కేసర్ భూములపై పెద్ద తతంగమే నడుస్తోంది. అటు దరఖాస్తుదారులు, గురుకుల్ ట్రస్టు, మరో వైపు ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ దళారులు మాత్రం ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు సాగిస్తున్నారు. గురుకుల్ ట్రస్టు భూములపై 2003, ఏప్రిల్ 26న, 2006 సెప్టెంబరు 21న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో అవి అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములుగా తేల్చారు. ఇతర శాఖల నుంచి వచ్చే అన్ని లిటిగేషన్లు, క్లెయిమ్స్‌లను పక్కన పెట్టాలని తీర్మానించారు. తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 21 రోజులకే సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 23, 2014లో 24 భవనాలను కూల్చారు. 11 భవనాలకు తాళాలు వేశారు. ఏమైందో ఏమో తెలియదు గానీ.. కొద్ది రోజులకే అంతా గప్ చుప్ అయిపోయింది. కూల్చిన భవనాల చోట పాత వాటికంటే ఎక్కువ ఎత్తులో కొత్తవి వెలిశాయి. అప్పుడప్పుడు కూల్చివేతల హడావుడి. గురుకుల్ ట్రస్టు భూములు, అయ్యప్ప సొసైటీ భూముల క్రమబద్ధీకరణ హామీలు తెర మీదికి వచ్చాయి. బల్దియా ఎన్నికల్లో ఈ హామీకే వేల ఓట్లు రాలతాయి.

నాటి నాయకుల నుంచి సీఎం కేసీఆర్ వరకు..
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం లోని ఎన్టీఆర్ నగర్ బస్తీవాసుల సమస్య ఇది. సరూర్ నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నం.9/1లోని 40 ఎకరాల్లో బస్తీ ఏర్పడింది. ఇందులో నోటరీల ద్వారా 60 నుంచి 100 గజాలు కొన్నవారే అధికం. కొందరు దళారులు ఈ స్థలాలను విక్రయించారు. కొందరైతే 60 గజాల్లో నాల్గంతస్థుల భవనాలను కట్టారు. ప్రభుత్వం సైతం రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సదుపాయాలు కల్పించింది. మూడు కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మించారు. కానీ ఈ సర్వే నం.9/1లోని 45 ఎకరాలు హన్మంతరావు అనే వ్యక్తి సొంతం. ఆయన ఓ ఐదెకరాలు వేరే వ్యక్తులకు విక్రయించారు. మిగిలిన 40 ఎకరాల్లో బస్తీ ఏర్పడింది. తన 40 ఎకరాల పట్టా భూమిని ఆక్రమించారంటూ ఆయన సుప్రీం వరకు వెళ్లి ప్రభుత్వంపై గెలిచారు. స్థలం ఖాళీ చేయించాలని లేదంటే దాని విలువకు తగ్గట్టుగా వేరే భూమినైనా అతనికి కేటాయించాలని సుప్రీం తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ స్థలంపై రాజకీయం మొదలైంది. ప్రభుత్వంలో మాట్లాడి వాటిని క్రమబద్ధీకరిస్తామంటూ నాయకులు రంగంలోకి దిగి ఓట్లు సాధించుకున్నారు. ఇలా 40 ఏండ్లు గడిచాయి. సీఎం హోదాలో వైస్ఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఆ బస్తీకి వచ్చి అదెంత పని అన్నారు.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ 2015 మే 20న అదే బస్తీకి, అదే స్థలంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి నెల, నెలన్నరలో అందరి చేతిలో పట్టాలు పెడతానన్నారు. కానీ ఇప్పటికీ పట్టాలు రాలేదు. ఇదే హామీతో టీఆర్ఎస్ తిరిగి ప్రచారం చేపడుతోంది.

అసైన్డ్ భూముల్లో ఇండ్ల పంచాయితీ
ఉప్పల్ మండలం నాగోల్‌లో అసైన్డ్ భూముల్లో నాయకులు వెంచర్లు వేశారు. మూడు దశాబ్దాల క్రితమే చాలా మంది ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాణాలు ప్రమాదంలో పడ్డాయి. ప్లాట్లు అమ్మిన నాయకులు అధికార పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తున్నారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఈ స్థలాలను క్రమబద్ధీకరిస్తామంటూ ప్రతి ఎన్నికల్లో నాయకులు హామీలిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైతం హామీనిచ్చారు కానీ పరిష్కరించడం లేదు. బాధితులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ అదే హామీని ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి అదే హామీని వల్లెవేస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో నిషేదిత స్థలాలపై పేచీ నడుస్తోంది. మన్సూరాబాద్ లో గతంలో విక్రయించి, కాలనీలు వెలిసిన తర్వాత అవి యూఎల్సీ భూములంటూ గతేడాది అక్కడి వారికి నోటీసులు అందాయి. క్రమబద్ధీకరణ పేరుతో రూ.లక్షల్లో జరిమానాలు లెక్క కట్టారు. ఇలాంటి బాధితుల ఓట్లను పొందేందుకు పార్టీల నాయకులు, అభ్యర్థుల ప్రయత్నాలు వర్ణనాతీతం.

ఇప్పుడైనా జీవో 111 ఎత్తేస్తారా?
జీఓ 111 పేరుతో సుమారు 84 గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ఎల్‌ఆర్ఎస్‌కు, ప్లాట్ల అమ్మకానికి సైతం అవకాశం ఇవ్వడం లేదు. జీవో ఎత్తెస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ ఇవ్వడంతో ఇక్కడ రియల్ వ్యాపారం భారీగా పెరిగింది. కానీ నేటికీ జీఓను ఎత్తేయలేదు. దీంతో ప్లాట్లు కొన్న వారు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల్లో సగానికి పైగా బల్దియా ఓటర్లే ఉన్నారు.

శాశ్వత హామీలు ఇవే..
మూసీ శుద్ధీకరణ, మూసీకి ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణం, మెట్రో రైలు రెండో దశ, ఎంఎంటీఎస్ రెండో దశ, హుస్సేన్ సాగర్ శుద్ధి వంటి హామీలు మేనిఫెస్టోకే పరిమితవుతున్నాయి. నాలాల శుద్ధీకరణ, విస్తరణ చేపట్టి ఎంత వర్షమొచ్చిన ముంపు ముప్పు ఉండకుండా చేస్తామంటున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో అందమైన చిత్రాలను చూపిస్తున్నారు. సిటీకి నలువైపులా టిమ్స్ వంటి ఆస్పత్రుల నిర్మాణం వంటి హామీలు మాటలకే.. ఇప్పుడేమో మూసీ నదిలో గోదావరి జలాలు పారిస్తాం.. బోటింగ్ చేసేలా మారుస్తాంంటూ సీఎం కేసీఆర్ ఇటీవలే పునరుద్ఘాటించారు. మరి ఓటర్లు వీటిని నమ్ముతారా? ఈ సారైనా వీటికి పరిష్కారం దొరుకుతుందా అనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి.

Advertisement

Next Story