ఆ కారణంతో స్వల్పంగా తగ్గిన ఉత్పత్తి కార్యకలాపాలు

by Harish |   ( Updated:2021-03-01 07:32:06.0  )
ఆ కారణంతో స్వల్పంగా తగ్గిన ఉత్పత్తి కార్యకలాపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఉత్పత్తి కార్యకలాపాలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గాయి. అయితే, కరోనా పరిణామాల అనంతరం డిమాండ్ పెరగడంతో తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుతున్నాయని ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సూచీ 57.7తో పోలిస్తే ఫిబ్రవరిలో 57.5కు తగ్గింది. అయితే, దీర్ఘకాలిక సగటు 53.6 కన్నా ఎక్కువే ఉండటం విశేషం. సాధారణగా పీఎంఐ సూచీ 50 కన్నా ఎక్కువ ఉంటే వృద్ధి నమోదైనట్టుగా పరిగణిస్తారు. తక్కువ ఉంటే క్షీణతగా పరిగణిస్తారు.

‘ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయంగా తయారీ సంస్థలు భారీగా కొత్త ఆర్డర్లను సాధించాయి. మెరుగైన డిమాండ్ పరిస్థితులు, మార్కెటింగ్ ప్రచారాలు ఈ కొత్త ఆర్డర్ల పెంపునకు కారణమని’ ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రతినిధి పొలియనా డి లిమా చెప్పారు. ఈ క్రమంలోనే తయారీ కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లు కూడా పుంజుకునే అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. కరోనా ప్రభావంతో సంస్థల ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నదని, లేదంటే ఫిబ్రవరిలో ఉత్పత్తి మరింత ఎక్కువగా నమోదయ్యే వీలుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed