పోలీసులపై అనుమానం ఉంది : శ్రీధర్ బాబు

by Sridhar Babu |   ( Updated:2021-02-18 06:32:44.0  )
Manthani MLA Sridhar Babu
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యకు నిరసనగా మంథని నియోజకవర్గంలోని పలు చోట్ల బంద్ పాటించారు. అఖిలపక్ష కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసులే నేరాలను ప్రొత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హత్య జరిగిన పరిధిలోని పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీపీ చిన్న భూ వివాదం వల్లే సంఘటన జరిగిందని చెప్పి చిన్న ఘటనగా చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ హత్య వెనక ఉన్న వారెవరు, కారణాలు ఏంటో తేల్చాల్సి ఉందన్నారు. వామన్ రావు చివరగా మాట్లాడిన వీడియో ద్వారా నిందితున్ని గుర్తించిన పోలీసుల అతని వెనక ఉన్న పెద్ద మనుషులు ఎవరో బహిర్గతం చేయాలన్నారు. న్యాయ వాదులను చంపిన హంతకులు వారికి వ్యతిరేకంగా తీర్పిస్తే వారిని కూడా చంపుతామన్న సంకేతాలు పంపినట్టుగా ఉందని శ్రీధర్ బాబు ఆరోపించారు.

ఏడేళ్లలో ఏడు మర్డర్లు మంథని ప్రాంతంలో జరిగాయని అందులో నలుగురు దళితులు ఉన్నారన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే న్యాయవాదుల హత్యలు జరిగేవి కావన్నారు. గుండాయిజం, రౌడియిజం చేసేవాళ్లకు ధైర్యం వచ్చిందని, ఈ కారణంగానే సీబీఐ విచారణ జరగాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. ఆరు టీంలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటన ఇవ్వడం వెనక నిందితులు రాష్ట్రం, దేశం దాటిపోవాలన్న ఆలోచన ఉందని ఆరోపించారు. మంథని శాసనసభ్యునిగా ఉన్న తాను ఇక్కడి హత్యా కాండ గురించి మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రౌడీయిజం గుండాయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేసును తప్పుదారి పట్టించేందుకే నా పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఈ హత్య గురించి స్పందించడం లేదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed