Farmers: రవాణా మోత.. ధరల కోత.. కమీషన్ల వాత@ మామిడి రైతు

by Anukaran |   ( Updated:2021-05-20 23:11:38.0  )
Gaddiannaram fruit market
X

దిశ, తెలంగాణ బ్యూరో: పండ రసాన్ని వ్యాపారి, వినియోగదారుడే తప్ప ఉత్పత్తి దారుడు ఏ మాత్రం ఆస్వాదించలేక పోతున్నాడు. అకాల వర్షాలు, ఈదురుగాలులు మిగిల్చిన కొద్దిపాటి దిగుబడులను పండ్ల మార్కెట్ కు తరలిస్తే అక్కడ రైతుకే చుక్కెదెరవుతోంది. రవాణా మోత.. ధరల కోత.. కమీషన్ల వాతకు తోడు మార్కెట్ దోపిడీకి మామిడి రైతు నష్టపోతున్నారు. ఉద్యాన మార్కెటింగ్ అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో హైదరాబాద్‌కు వచ్చిన మామిడి రైతులకు దారి ఖర్చులు కూడా మిగలని పరిస్థితి దాపురించింది.

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్. 22 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 270 దుకాణాలకు లైసెన్సులు కలిగి ఉన్నాయి. అనాధికారిగా వెయ్యికి పైగా ఉన్నాయి. ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. అయితే ఏడాదంతా రైతు కష్టపడితే వచ్చేది ఒకే క్రాప్. ఆ క్రాపు చేతికి వచ్చే సారికి నాలుగునుంచి ఆరుసార్లు పిచికారీ చేయాలి. వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టాలి. చేతికొచ్చిన ఆ క్రాపును తిరిగి మార్కెట్‌కు తరలించేందుకు కూలీలు కావాలి. తీరా మార్కెట్ కు తరలించిన తర్వాత ఆశించిన ధర రాకపోతే రైతన్నకు కన్నీరే. ఈ ఏడాది ప్రకృతి వైఫరిత్యాలతో రైతన్న తీవ్ర నిరాశే మిగిలింది. ఈదులు గాలులతో కూడిన వడగళ్ల తాకిడికి పెట్టబడులు, ఆరుగాలం కష్టం నీరుగారింది. వచ్చిన కొద్దిపాటి కాయలను మార్కెట్లో అమ్ముకుందామంటే దళారుల బెడద ఎక్కువైంది. మామిడి కాయకోత మార్చిలోనే మొదలైన కమీషన్ దారుల దందా రైతులను ముంచేస్తుంది. టన్ను రూ.32వేల నుంచి 40వేలు పలికిన మామిడి కాయ ధర ప్రస్తుతం కనీసం రూ.5 వేల నుంచి 20వేలు పలకడం లేదని ఉత్పత్తి దారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అంతర్జాయంగా మామిడి గిరాకీ..

మార్కెటింగ్ దృష్ట్యా కమిషన్ దారుడు, చిల్లర వర్తకులు, ఎగుమతి దారుడు పోటీ పడి గడ్డి అన్నారం మార్కెట్లో కొనుగోలు చేస్తుంటాడు. కేజీకి రూపాయి ఎక్కువ వచ్చినా కూలీల ఖర్చు వెళ్తాయనే భావనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను గడ్డి అన్నారం మార్కెట్ కు తీసుకొస్తుంటారు. తోతాపురి, భంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు తీసుకొస్తారు. అయితే టన్నుల కొద్ది తెచ్చినా కాంటా, వేలం పాట, నగదు చెల్లింపుల వరకు రైతు జేబులకు చిల్లులుపడుతున్నాయి. వేధింపులు, దళారుల మోసాలు యథేచ్చగా కొనసాగుతున్న మార్కెటింగ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

టన్ను రూ.20 వేల లోపే…

రైతు ఒక టన్ను మామిడిని పండించాలంటే రూ.20వేలు ఖర్చుఅవుతుంది. అయితే కోత నుంచి మార్కెట్‌కు తరలించే వారు వాహనాల బాడుగ, హమాలీ, కమీషన్లు తీస్తే రైతుకు రూపాయి కూడా మిగలడం లేదు. పైగా అప్పులే మిగులుతున్నాయి. చేసిన కష్టమంతా వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దస్తమానం పనిచేసినా గిట్టుబాటు కావడం లేదు. అదే కూలీకి పోయినా రోజు 500లు వస్తాయని… 8 గంటలు పనిచేస్తే సరిపోతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
రాబోయే రోజుల్లో మామిడి సాగు చేయబోమని రైతులు అభిప్రాయ పడుతున్నారు. వీటన్నింటికి తోడు నూటికి మార్కెట్ అధికారులు రూ.12 కమీషన్ పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేదే అంతంత మాత్రమని… దీంట్లోనే కమీషన్ ఎక్కువ కట్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.

రూ.30వేలు కూడా రాలేదు…

Swami

నాది కొల్లాపూర్. గత పదేళ్లుగా మామిడి తోటలను కౌలుకు తీసుకుంటా. నాలుగు ఎకరాల తోటకు 2 టన్నుల 7 క్వాంటాళ్ల దిగుబడి వచ్చింది. కూలీలో తెంపించి డీసీఎంలో మార్కెట్‌కు తీసుకొచ్చా. అమ్మితే అన్ని ఖర్చులు పోను రూ.30వేలు వచ్చింది. వాటిలోంచి మందులకు, చెట్ల మంది దుక్కినందుకు ట్రాక్టర్ కిరాయిలు తీస్తే ఏమీ మిగలదు.
-స్వామి, కొల్లాపూర్, వనపర్తి

బండి ఖర్చు కూడా ఎల్లేటట్టు లేదు…

Narayana

నాకు రెండెకరాల్లో 100 చెట్ల వరకు ఉంటాయి. ఈదురుగాలు, తుఫాన్ కు సగం కాయ రాలిపోగా.. మిగతాది ఉంటే మార్కెట్ కు తీసుకొచ్చిన. నాలుగు టన్నులు అయితది. అధికారులు కాకుండా దళారులే వచ్చి కాయను చూసి పోయిండ్రు. టన్ను రూ.5వేలు అడిగిండ్రు. కాయను మార్కెట్ కు తీసుకొచ్చినందుకే రూ.6వేలు అయింది. ఎట్ల అమ్మేది. లాభం రాకున్న… తీసుకొచ్చిన ఖర్చుకూడా ఎల్లేటట్టు లేదు. ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. కొడుకు తీసుకొచ్చిన ఇడ్లీ కూడా తినబుద్ది కావట్లే.
-నారాయణ, అచ్చంపేట

వేలం పాటతో నష్టం

Naganna

20 ఏళ్లుగా మామిడితోటలను లీజుకు తీసుకొని పండిస్తున్న. ఎప్పుడైన సీజన్ లో రూ.30వేలకు పైగా పలికేది. మార్కెట్ అధికారులు దగ్గరుండి కొనుగోలు చేసేవారు. మామిడి కాయ సైజును బట్టి ధర పెట్టేవారు. కానీ ఇప్పుడు కాయ సైజుతో కాకుండా వేలం పాట వేస్తున్నరు. దళారులు ఎంత చెబితే అంతకే ఇవ్వాలి. లేకుంటే రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు స్పందించి పర్యవేక్షణ చేయాలి. రైతుకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. ఇట్లే ఉంటే భవిష్యత్తులో మామిడి తోటలను సాగు చేసేందుకు ఎవరు ముందుకురారు.
-నాగన్న, వనపర్తి, మామిడి రైతు

Advertisement

Next Story