‘ట్విట్టర్ కిల్లర్’కు ఉరిశిక్ష

by Anukaran |   ( Updated:2020-12-15 06:30:03.0  )
‘ట్విట్టర్ కిల్లర్’కు ఉరిశిక్ష
X

టోక్యో: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాట్‌ఫామ్స్‌ను ఎవరు ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మంచికైనా చెడుకైనా! కొంత మంది బలహీన క్షణాల్లో ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేస్తుంటారు కూడా. ఇలాంటి వారిని ట్విట్టర్ ద్వారా సంప్రదించి హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ శాడిస్ట్. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిపై హత్యకు పాల్పడిన ‘ట్విట్టర్ కిల్లర్’‌కు జపాన్ కోర్టు మంగళవారం ఉరిశిక్ష విధించింది.

30ఏండ్ల తకాహికో హిరాయిషి అలియాస్ ‘ట్విట్టర్ కిల్లర్’. మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, నేను సహకరిస్తా. మీరు ఎలా చావాలనుకుంటే అలా. ఇలా ట్విట్టర్ ద్వారా అభాగ్యులను హిరాయిషి సంప్రదిస్తుంటాడు. వారితో పరిచయం పెంచుకుంటాడు. చివరికి వారిని హత్య చేసి, శరీర భాగాలను క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ట్విట్టర్ కిల్లర్ హత్య చేసిన తొమ్మిది మందిలో ఒక్కరు మినహా అంతా మహిళలే. 15 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు వారే కావడం గమనార్హం.

హత్యకు గురైన వారు ఆత్మహత్య చేసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారని, వారి అంగీకారం మేరకే ట్విట్టర్ కిల్లర్ వారిని హత్య చేశాడని అతని తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే నిందితుడికి జీవిత ఖైదు విధించాలని కోరాడు. ఇందుకు నిరాకరించిన కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. తొమ్మిది మందిలో ఎవరూ హత్య చేయాలని కోరలేదని, ఆత్మహత్య చేసుకోవాలని మాత్రమే అనుకున్నారని జడ్జి పేర్కొన్నారు.

కోర్టు తీర్పు అనంతరం 25ఏండ్ల బాధితురాలి తండ్రి మాట్లాడుతూ హిరాయిషిని ఉరి తీసినా అతడిని ఎప్పటికీ క్షమించనని తెలిపారు. నా కూతురు వయస్సు అమ్మాయిని ఎవరిని చూసినా… నా కూతురే గుర్తుకు వస్తుంది. ఈ బాధ ఎప్పటికీ తగ్గదు. నా కూతుర్ని నాకు వెనక్కి ఇవ్వు అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షను అమలు చేస్తున్న కొన్ని దేశాల్లో జపాన్ ఒకటి. గత ఏడాది డిసెంబర్‌లో చైనా జాతీయుడిని ఆ దేశంలో ఉరి తీశారు.

Advertisement

Next Story

Most Viewed