చిన్నాన్న బిడ్డలపై అన్న దారుణం…!

by Anukaran |
చిన్నాన్న బిడ్డలపై అన్న దారుణం…!
X

దిశ, ఏపీ బ్యూరో: చిన్నాన్న బిడ్డలను సొంత తమ్ముళ్ళలా చూసుకోవాల్సినవాడు.. ప్రాణాలనే తీశాడు. ముందు వారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ చిన్నారిని కర్కశంగా చంపేశాడు. మరో చిన్నారిని రిజర్వాయర్లోకి విసిరేశాడు. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం మార్తాడులో చోటు చేసుకుంది. ఒక బిడ్డను కోల్పోయి మరో కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. కన్నవాళ్ల బాధ వర్ణనాతీతం.

మార్తాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతులకు ఇద్దరు మగపిల్లలు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తన అన్నకొడుకు రాము బుధవారం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడని శ్రీనివాసులు వాపోయాడు. కొన ఊపిరితో ఉన్న ఆరేళ్ల శశిధర్‌ను కనేకల్ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ బాబును అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన శశిధర్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు బెళుగప్ప పీఎస్‌కు తీసుకువెళ్లి విచారించారు. దీంతో మూడేళ్ల మోక్షజ్ఞను ఉరవకొండ మండలం, హంద్రినీవా కాలువలో పడేసినట్లు చెప్పాడు. వెంటనే పోలీసులు జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర గాలింపు చేపట్టగా హంద్రీనీవా కాలువలో మృతదేహం లభ్యమైంది.

Advertisement

Next Story