మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని చితక్కొట్టారు

by Shamantha N |
మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని చితక్కొట్టారు
X

భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవమాడుతున్నది. దీని కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినా, కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో ఓ ఆటోడ్రైవర్ మాస్క్ సరిగ్గా ధరించకపోవడంతో పోలీసులు చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.

మధ్యప్రదేశ్‌లోని ఓ ఆటోడ్రైవర్ క్రిష్ణ కేయర్ ఆస్పత్రిలోని తండ్రిని చూడటానికి హడావిడిగా వెళ్తున్నాడు. తను ధరించిన మాస్క్ ముక్కు పై నుంచి కిందికి జారింది. ఆటో డ్రైవర్ దాన్ని పట్టించుకోలేదు. కానీ, దీన్ని చూసిన ఇద్దరు పోలీసులు ఊరుకోలేదు. క్రిష్ణను రోడ్డుపైకి లాగి చితకబాదారు. మోకాళ్లతోతన్నారు. పిడిగుద్దులు కురిపించారు. క్రిష్ణ కొడుకు సహాయం కోసం అరుస్తూ వీడియోలో కనిపించాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు తప్పకుండా వీటిని పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ‘చట్టాన్ని ఉపయోగించండి, జరిమానాలు విధించండి’ అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సూచనలు చేశారు. ఏదేమైనా ప్రజలు మాస్కు ధరించాల్సిందే అని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, కరోనా కట్టడిలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.

Advertisement

Next Story