తాగునీరు లేక.. అడవిబిడ్డల గోస

by Shyam |
తాగునీరు లేక.. అడవిబిడ్డల గోస
X

దిశ, అచ్చంపేట: అసలే వేసవి కాలం.. మండుటెండలు… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కరోజు తాగు నీటి సరఫరా కాకపోతే అవస్థలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిత్యం అసౌకర్యాల సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులు అలసత్వం చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు నిదర్శనంగా నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న మల్లాపూర్ ఆదివాసీ గిరిజనులు బుక్కెడు తాగునీటి కోసం వారు పడుతున్న గోస…. ఈ ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ మండల పరిధిలోగల… మల్లాపూర్ చెంచు పెంటలో గత 15 రోజులుగా తాగునీరు లేక ఆదివాసీ గిరిజనులు అవస్థలు పడుతు సెలిమే నీరే వారికి దిక్కయింది. ఈ గూడెంలో 40 కుటుంబాలు 180 మంది జనాభా ఉన్నారు.

మాపట్ల వివక్ష ఎందుకు…

ఉన్న రెండు చేతిపంపులు చెడిపోవడంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. చేతిపంపు లను మరమ్మతు చేయాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మరమ్మతులు చేయిస్తామని చెప్పారే కానీ పరిష్కారం చూపలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో లోతట్టు ప్రాంతంలో ఉంటున్న ఆదివాసీల పట్ల అధికారులు ప్రతి సందర్భంలో వివక్ష చూపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కలుషిత చెలిమి నీరే దిక్కు…

పాడైన చేతిపంపులు మోటర్లు గత పది రోజుల క్రితం సంబంధిత అధికారులు తీసుకెళ్లి మరమ్మతులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు జాడ లేరని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గుండానికి అర
కిలోమీటర్ల దూరంలో గల ఒక సెలిమేలో గల కలుషిత నీటిని అడవి జంతువులు, గూడెం ప్రజలు కలిసి తాగుతున్న దుర్భర దుస్థితి నెలకొంది.

కలెక్టర్ సారు తాగు నీళ్లు పంపండి

ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల సమస్యల పరిష్కారం దిశగా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సారు తాగు నీళ్లు పంపాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. వేసవికాలంలో కనీసం మంచినీళ్లు తాగేందుకు సౌకర్యాలు కల్పించాలని మొరపెట్టుకున్నారు. మా బాధలు, గాథలు మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలుపుతూ పరిష్కార అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేతిపంపులు మరమ్మతులకు చేసే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story