అంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే.. నెటిజన్ల ప్రశంసలు!

by Shyam |   ( Updated:2021-09-08 12:19:49.0  )
అంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే.. నెటిజన్ల ప్రశంసలు!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో ఓ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న అంబులెన్సు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడే ట్రాఫిక్‌లో చిక్కుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అనంతరం అంబులెన్సును సజావుగా అక్కడి నుంచి పంపించివేశారు.

వివరాల్లోకివెళితే.. దేవరకద్ర మండల కేంద్రంలో పలు కారణాలతో బుధవారం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిమిష నిమిషానికి వాహనాల సంఖ్య పెరిగి పోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుండి రాయచూర్ వైపు వెళ్తున్న అంబులెన్సు కూడా చిక్కుకుపోయింది. అందులో ఓ రోగి అనారోగ్యంతో పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుండి మక్తల్ వెళ్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిస్థితిని కొంత సేపు అంచనా వేశారు. ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వాహనం నుంచి కిందకు దిగిన ఎమ్మెల్యే దాదాపు పదిహేను నిమిషాల పాటు వాహనాల రాకపోకలను నియంత్రించారు.

ముందుగా అంబులెన్స్ వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం మిగతా వాహనాలను నియంత్రించారు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆయన తన వాహనంలో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే చిట్టెం చేసిన పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఎమ్మెల్యే చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story