డెలివరీలకు ఎలక్ట్రిక్ వాహనాలు : మహీంద్రా లాజిస్టిక్స్!

by Prasanna |   ( Updated:2020-12-28 10:20:26.0  )
డెలివరీలకు ఎలక్ట్రిక్ వాహనాలు : మహీంద్రా లాజిస్టిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అనుబంధ సంస్థ మాహింద్రా లాజిస్టిక్స్ సరికొత్త నిర్ణయాన్ని వెల్లడించింది. కస్టమర్లకు డెలివరీలను అందించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా 2025-26 నాటికి ఈ విభాగం నుంచి రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పలు నగరాల్లో కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా వస్తువులను డెలివరీ చేయాలని నిర్ణయించగా, ఇదే బాటలో ఫర్నీచర్ రిటైల్ దిగ్గజం ఐకియా, ఆన్‌లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కస్టమర్లకు సరుకులను డెలివరీ చేయాలని నిర్ణయించాయి.

ఈ నేపథ్యంలో లాజిస్టిక్స్‌లో ఎలక్టిక్ వాహనాల డిమాండ్‌ను భర్తీ చేసేందుకు మహీంద్రా లాజిస్టిక్స్ సిద్ధమవుతోంది. మహీంద్రా లాజిస్టిక్స్ దేశీయంగా అతిపెద్ద థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలను అందిస్తున్న సంస్థగా ఉంది. ముఖ్యంగా సప్లై చైన్, ఎంటర్‌ప్రైజెస్ మొబిలిటీలో ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనున్న తరుణంలో కొత్త సేవలను ప్రారంభించడం, ప్రస్తుత విభాగాల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed