మహారాష్ట్రలో కరోనా రెండో దశ..! కేంద్రం ఆందోళన

by Anukaran |   ( Updated:2021-03-16 03:23:07.0  )
corona second stage in maharashtra
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ కరోనా రెండో దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దీనిపై అధ్యయనం చేయడానికి గతవారం కేంద్రం బృందం ఒకటి రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ బృందం అందజేసిన నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ తాజాగా స్పందించింది. ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.

‘మహారాష్ట్ర కరోనా రెండో దశ ప్రారంభంలో ఉంది. అందరికీ టెస్టులు చేయడం.. కరోనా సోకినవారికి గుర్తించడం.. వారిని క్వారంటైన్‌లో ఉంచడం వంటివి చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిపై జిల్లా అధికార యంత్రాంగాల్లోనూ ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు’ అని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ కరోనా మొదటి దశలో జరిగినట్టే జరిగే ప్రమాదముందని హోంశాఖ హెచ్చరించింది. కరోనాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాక్షిక లాక్‌డౌన్‌లు, రాత్రి పూట కర్ఫ్యూలు, ఆంక్షలు ఎంతమాత్రమూ ప్రభావం చూపే విధంగా లేవని తెలిపింది.

గడిచిన వారం రోజులుగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 13 వేలకు మించే నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో మరో కఠిన లాక్‌డౌన్ తప్పదని భావిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను విడుదల చేయడం గమనార్హం. కాగా కేంద్రం లేఖ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా హాళ్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్‌కు కొత్త రూల్స్ ప్రకటించింది. హోటల్స్, మాల్స్‌లో సోషల్, కల్చరల్ వేడుకలకు అనుమతి లేదని తెలిపింది. పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లకు 50 మందికే అనుమతినిచ్చింది. పాజిటివ్ సోకినవారికి 14 రోజుల పాటు క్వారంటైన్ ‌లో ఉండాలని సూచించింది. అత్యవసర సర్వీసులు మినహా షాపులు 50:50 నిష్పత్తిలో తెరవాలనీ, నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అందరికీ టీకా వేసేలా అనుమతులివ్వండి : కేంద్రానికి ఆనంద్ మహేంద్ర విన్నపం

మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముంబయి వంటి పారిశ్రామిక నగరంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తే అది వ్యాపార కార్యకలాపాలకు, ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ వ్యాక్సిన్ల కొరత ఉండకూడదని.. అందరికీ టీకా వేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed