‘మహా గవర్నర్’ను కలిసిన సోనూసూద్

by Shyam |
‘మహా గవర్నర్’ను కలిసిన సోనూసూద్
X

వలస కార్మికుల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్‌ను దేశం మొత్తం రియల్ హీరోగా అభివర్ణిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వందలాది వలస కార్మికులను ఇంటికి చేర్చడంలో సోనూ చూపించిన చొరవను ప్రశంసించని వారు లేరు. ఇటీవలే వలస కార్మికుల కోసం ఓ విమానాన్ని కూడా బుక్ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. సోనూను చూసి గర్వంగా ఉందని ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారి సోనూసూద్‌ను ముంబైలోని రాజ్ భవన్‌కు ఆహ్వానించారు. వలస కార్మికులు క్షేమంగా ఇంటికి చేరేందుకు ఏర్పాట్లు చేసినందుకు అభినందించారు. తను చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.

ఒడిశా సీఎం ప్రశంసలు..

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం సోనూసూద్ చేస్తోన్న సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘నన్ను మీ మాటలతో ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్యూ సార్. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యతగా భావించాను. దేశంలో ఎక్కడ అవసరమున్న నావంతు సాయం చేస్తాను’ అని సోనూసూద్ బదులిచ్చారు.

సల్మాన్‌ను బీట్ చేసిన సోనూ :

తను చేస్తోన్న సహాయ కార్యక్రమాలతో సోనూసూద్ సోషల్ మీడియా పాపులారిటీలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ పాపులారిటీని దాటేశాడు. ఎందులో అనే అనుమానం వచ్చిందా ? రీసెంట్‌గా ట్విట్టర్‌లో కమల్ ఆర్ ఖాన్ నెటిజన్లకు ఓ సవాల్ విసిరారు. అదేంటంటే.. సల్మాన్, సోనూసూద్ సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఎవరి సినిమాకి వెళ్తారు? అని కేఆర్‌కే ఓ పోల్ పెట్టాడు. దీనిలో 65 శాతం నెటిజన్లు సోనూసూద్‌కే ఓటేయడం విశేషం.

Advertisement

Next Story